అమరావతి కంటే మంచి ప్యాకేజీ
► ఎయిర్‌పోర్టు విస్తరణలో భూములిచ్చే రైతులకు..
► కృష్ణా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇస్తున్న రైతులకు అమరావతి ప్రాంతంలో కంటే మంచి ప్యాకేజీ ఇస్తామని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మెట్ట, జరీబు రైతులని రెండు రకాలు ప్యాకేజీలు ఇచ్చారని చెప్పారు. గన్నవరం నిర్వాసితులందరికీ ఒకే విధంగా జరీబు భూముల ప్యాకేజీ ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. గన్నవరం రైతులకు రాజధానిలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలం, 450 చదరపు గజాల వ్యాపార కూడలి స్థలం ఇస్తామన్నారు.
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు స్థలం కేటాయించి, ఆ తరువాత క్రమంలో గన్నవరం నిర్వాసితులకు అక్కడే స్థలం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు సంబంధించి 926 మంది రైతుల నుంచి 1229 ఎకరాలు సేకరించాల్సి ఉండగా..
ఇప్పటికి 475 మంది రైతులు 494.22 ఎకరాల భూమి ఇవ్వడానికి మందుకువచ్చారని తెలిపారు. భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇవ్వడానికి రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు. మిగిలిన రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారని వివరించారు. గన్నవరం మండలంలో 9గ్రామాలు, ఉంగుటూరు మండలంలో రెండు గ్రామాలు.. మొత్తం 11 గ్రామాల్లో భూసమీకరణ చేపడుతున్నామన్నారు.
భూముల క్రయవిక్రయాల లావాదేవీలపై ఎటువంటి అభ్యంతరాలు లేవని రిజిస్ట్రేషన్లు నిర్వహించుకోవచ్చని తెలిపారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి 15 రోజుల్లో సంవత్సరపు కౌలు మెత్తం రూ.50 వేలు వారి ఖాతాలకు జమ చేస్తామన్నారు. భూమి లేని నిరుపేదలకు రూ.2,500 పింఛన్ అందిస్తామని చెప్పారు. వారికి నైపుణ్యంతో కూడిన శిక్షణ కూడా ఇస్తామన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో 15ఎకరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేద కుంటుంబాలకు రూ. 25 లక్షల వరకు స్వయం ఉపాధి కోసం వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు.