కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ శశిధర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు ఆఫీసు నుంచి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఉదయం పూట పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు పర్యటించాలని, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీటి సరఫరాలపై ప్రజలను అడిగి తెలుసుకోవాలన్నారు. కడప నగరంతోపాటు ఇతర మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆస్తిపన్ను వసూళ్లు పెంచాలని, నిబంధనలకు అనుగుణంగా పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి పొరపాట్లకు అవకాశం లేకుండా పన్ను పసూళ్ల లక్ష్యాలను సాధించాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో చేపడుతున్న పనుల్లో పురోగతి చూపించాలన్నారు. పనులు గడువులోపు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని స్పష్టం చేశారు. మున్సిపల్ వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు. రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి డిసెంబరు వేతనం చెల్లించలేదని తెలియడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీతాలివ్వకపోతే పనులు ఎలా చేస్తారంటూ కమిషనర్లను ప్రశ్నించారు. తక్షణమే వర్కర్లకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పండుగ తర్వాత ప్రతి మున్సిపాలిటీని సందర్శిస్తామన్నారు.
ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్స్, వీధి లైట్లు తప్పక వేయాలని చెప్పారు. నీటి సరఫరా ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుందో ఆయన ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా మెరుగుపరచాలన్నారు. ఎర్రగుంట్లలో డంపింగ్‌యార్డు స్థలానికి వారం రోజుల్లోపు ఆర్డీఓకు ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. భవన నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు. సెట్ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ నిర్మల, అసిస్టెంట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, ఆర్డీఓలు హరిత, రఘునాథరెడ్డి, కడప మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు
Published Thu, Jan 9 2014 4:56 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement