బెజవాడ– వైజాగ్ రూ. 19,332..
రూ.4 వేల విమాన టిక్కెట్ ధర భారీగా పెంపు.. ఒకే ఒక్క సర్వీసు కారణంగా రద్దీ
సాక్షి, అమరావతి: విజయవాడ– విశాఖపట్నం మధ్య విమానం టిక్కెట్ ధర శుక్రవారం అమాంతంగా ఆకాశానికి ఎగబాకింది. సాధారణ రోజుల్లో నాలుగు.. నాలుగున్నర వేలకు లోపే ఉండే టిక్కెట్ ధరను ఏకంగా రూ.19,332కు పెంచేశారు. రెండు నగరాల మధ్య ఒకే ఒక విమాన సర్వీసు నడుస్తుండడంతో పాటు శనివారం నుంచి విశాఖపట్నంలో మహానాడు కార్యక్రమం మొదలవుతున్నందున శనివారం మధ్యాహ్నం వెళ్లే విమానానికి రద్దీ పెరిగిందని తెలుస్తోంది.
శుక్రవారం వరకు విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహానాడుకు హాజరయ్యేందుకు గాను విమాన ప్రయాణానికి మొగ్గుచూపడంతో డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఇలావుండగా విశాఖ విమానం టిక్కెట్ ధరను ఐదు రెట్లు దాకా పెంచడాన్ని నిరసిస్తూ శనివారం తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రకటించారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా రద్దీ పేరుతో ధర ఇలా పెంచడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన ‘సాక్షి’వద్ద వ్యాఖ్యానించారు.