భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చిందని నాగిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. స్మృహలేని స్థితిలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. నాగిరెడ్డి అస్వస్థకు గురయ్యారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నంద్యాల ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు.
నిన్ననే సీఎం చంద్రబాబుతో నాగిరెడ్డి భేటీ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబును కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, శిల్పా సోదరులతో విభేదాలు, మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చించారు.
నాగిరెడ్డి అనారోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయనను తరలించేందుకు అవసరమైతే హెలికాప్టర్ వాడాలని ఆదేశించారు. మరోవైపు అహొబిలంలో ఉన్న నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ హుటాహుటిన నంద్యాలకు బయలుదేరారు.