=గ్రీన్‌సిగ్నల్ ఇవ్వని ప్రభుత్వం
=ఈ నెలలో భూపంపిణీ లేనట్లే
=నీటి వసతి లేని 3 వేల ఎకరాలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టదలచిన 7వ విడత భూపంపిణీ కార్యక్రమం గందరగోళంలో పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ నెలలో భూపంపిణీ లేనట్లేనని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పంపిణీ చేసిన భూముల్లో చాలా వరకు నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి.
సాక్షి, చిత్తూరు: నియోజకవర్గాల వారీగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వ అసైన్‌మెంట్ భూములను పంపిణీ చేసేలా వైఎస్ హయాం లో భూపంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికి 6 విడతలు భూపంపిణీ చేశా రు. జిల్లాలో 7వ విడత భూపంపిణీని రచ్చబండకు ముందే నిర్వహించాలనుకున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. గతంలో భూపంపిణీని నవంబర్‌లోనే చేపట్టి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భూపంపిణీని ఇన్‌చార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా చేయించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల, తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలే దు. దీంతో ఈ నెలలో భూపంపిణీ నిర్వహించడం సందేహమేనని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇచ్చిన భూముల్లో ఇందిర జలప్రభ ద్వారా బోర్లు వేసినా చాలా చోట్ల నీళ్లు పడకపోవడంతో సాగులోకి రాలేదు.
సమస్యలు అధికం
కొన్ని మండలాల్లో 7వ విడత భూపంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వ భూములు లేవని నివేదికలు వెళ్లాయి. అలాంటి చోట్ల రెవెన్యూశాఖకు సంబంధం లేకుం డా, వేరే ప్రభుత్వ విభాగాల అధికారులను రంగంలోకి దించుతున్నారు. భూ పంపిణీకి అవసరమైన భూమి నిజంగా నే లేదా, అక్కడ ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమిటనే వివరాలను జిల్లా ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఇలా ఇతర విచారణ చేయించినా ఆ వివరాలు ఎప్పటికి అందుతాయో అర్థం కాని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా దాదాపు 900 గ్రామాల్లో లబ్ధిదారులకు పంచేందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేదని నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
గడిచిన 6 విడతల భూపంపిణీలో 14,862 మందికి 17,818 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. భూ అభివృద్ధికి పెట్టుబడులు లేక ఎస్సీ, ఎస్టీలు 50 శాతానికిపైగా భూములను అలాగే ఉంచేశారు. ఇందిర జలప్రభ కింద భూపంపిణీలో ఇచ్చిన భూములకూ డ్వామా ద్వారా సాగునీటి వసతి కల్పించేందుకు కొన్ని చోట్ల బోర్లు వేశారు. నారాయణవనం మండలంలో బోరు వేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. మోటారు బిగించలేదు. ఇక్కడే మరొక లబ్ధిదారుడికి బోరు వేసి మోటారు బిగించారు.
అయితే స్టార్టర్ బోర్డుకు ఫీల్డ్ అసిస్టెంట్ తాళం వేసుకుని వెళ్లడంతో భూమి సాగుచేసుకునేందుకు నీళ్లు వదులుకునే పరిస్థితి లేదు. ఇలా మదనపల్లె, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మొత్తం 1029 బోర్లు డ్వామా వేస్తే 894 చోట్ల నీళ్లు పడ్డాయి. 374 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినా మోటార్లు లేకపోవడంతో భూములు నిరుపయోగంగా మారాయి. 520 బోర్లకు మాత్రమే అధికారులు మోటార్లు బిగించారు. వీటిల్లో పలుచోట్ల మామిడిమొక్కలు నాటేందుకు ఉపాధి హామీలో చేపట్టిన పనులు గుంతలకే పరిమితమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం సదుంలో 37, కుప్పంలో 37, శ్రీకాళహస్తిలో 17, చంద్రగిరిలో 32, కలికిరిలో 33, పుత్తూరులో 31, మదనపల్లెలో 26, చిత్తూరులో 15, ములకచెరువులో 21 బ్లాకుల్లో 3,000 ఎకరాలు నీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయి.
7వ విడత ప్రతిపాదనలు ఇలా
7 విడత భూపంపిణీకి తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లలో 5,558 ఎకరాలను గుర్తించారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్ లో 180 గ్రామాల్లో, తిరుపతి రెవెన్యూ డివిజన్ లో 98 గ్రామాల్లో, మదనపల్లె రెవెన్యూ డివిజ న్‌లో 285 గ్రామాల్లో భూపంపిణీ చేయాలని నిర్ణయించారు. చిత్తూరులో 14,95, తిరుపతిలో 1,483, మదనపల్లెలో 2,576 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరికి త్వరలో నిర్వహించే భూపంపిణీలో పట్టాలు అందజేస్తారు.
భూ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం: బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్
జిల్లాలో 7వ విడత భూ పంపిణీకి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు, భూములు అందజేస్తాం.
గందరగోళంలో భూపంపిణీ
Published Fri, Nov 29 2013 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement
Advertisement