కాంగ్రెస్‌తో బీజేపీ కలవటం బాధాకరం: అడుసుమిల్లి
హైదరాబాద్: రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీతో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా పోటీపడటం బాధాకరమని విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతంలో నాలుగు సీట్లకు ఆశపడి కాంగ్రెస్‌తో చేతులు కలిపి బీజేపీ రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడవటం గర్హనీయమని తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో వ్యవహరిస్తున్న తీరునే భవిష్యత్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కేంద్రం అనుసరించే ప్రమాదం ఉందని అడుసుమిల్లి హెచ్చరించారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించాలని సూచించారు. రాష్ట్ర విభజన విషయంలో శాసనసభ తీర్మానం తరువాతే ముందుకు వెళ్లాలన్నారు.
రాష్ట్ర శాసనసభకు విలువలేదన్నట్లుగా ఫెడరల్ వ్యవస్థను తుంగలో తొక్కటం, దేశ సమగ్రత, ఐక్యతను భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దన్న పెత్తనం దేశ రాజ్యాంగానికే పెను సవాల్ అని ఆందోళన వ్యక్తం చే శారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేని వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్ర విభజనకు అనుసరిస్తున్న ప్రక్రి యను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.