సాక్షి, హైదరాబాద్: ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీఎం కిరణ్ అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగరరావు ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములుకు, ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేద ని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో చెప్పారు. పొట్టి శ్రీరాములు మరణించే నాటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదని.. పొట్టి శ్రీరాములు, సర్దార్ పటేల్ రాష్ట్రాన్ని ఎలా సమైక్యంగా ఉంచారో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణ విలీనం కోసం 1953 ఏప్రిల్ 11న అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.
ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం వీగిపోయిన విషయం తెలిసి కూడా వారిద్ద రూ అబద్ధాలు చెబుతున్నారని, దానిపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని విద్యాసాగర్‌రావు చెప్పారు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులు ఇంకా సజీవంగానే ఉన్నాయన్నారు. ఉండవల్లి, కిరణ్ రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నారని, వారి తీరు చూస్తోం టే కొత్త రాజ్యాంగాన్నే రాసేట్టుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాగా.. గుజరాత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి దేశంలోని 6 లక్షల 50 వేల గ్రామాల నుంచి మట్టి, పాత ఇనుమును సేకరిస్తున్నట్టు వివరించారు. అన్ని గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యుల ఫోటోలను కూడా విగ్రహ ప్రాంగణంలో పెడతారని చెప్పారు. డిసెంబర్ 15న దేశవ్యాప్తంగా ఏక్తా రన్ (సమైక్యతా పరుగు)ను నిర్వహిస్తున్నామని, దానిని ఆ రోజు ఉదయం 8 గంటలకు గుజరాత్ సీఎం మోడీ ప్రారంభిస్తారని తెలిపారు.
ఉండవల్లి, కిరణ్‌వి పచ్చి అబద్ధాలు: బీజేపీ
Published Sat, Nov 2 2013 5:04 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement