పేదల బియ్యం బ్లాక్‌  మార్కెట్‌లో.. | Black Marketers Selling Ration Rice In Kandukur Prakasam | Sakshi
Sakshi News home page

జోరుగా అక్రమ బియ్యం వ్యాపారం

Aug 19 2019 8:04 AM | Updated on Aug 19 2019 8:04 AM

Black Marketers Selling Ration Rice In Kandukur Prakasam - Sakshi

సాక్షి, కందుకూరు: అక్రమ బియ్యం వ్యాపారానికి కందుకూరు ప్రాంతం కేంద్రంగా మారుతుంది. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఈ బ్లాక్‌ మార్కెట్‌ దందా విచ్చలవిడిగా సాగుతున్నా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. దీంతో అక్రమ బియ్యం వ్యాపారులు యథేచ్ఛగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బియ్యం వ్యాపారులకు అధికారుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పేదల బియ్యం ప్రతి నెలా టన్నుల కొద్దీ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ వ్యవహారంలో రేషన్‌ డీలర్ల దగ్గర నుంచి అధికారుల వరకు అందరూ భాగస్వాములునే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బహిరంగ రహస్యమే...
కందుకూరు ప్రాంతంలో బియ్యం వ్యాపారం ఎవరు చేస్తున్నారు, ఎక్కడికి బియ్యం వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యమే. ఏ డీలర్‌ ఎవరికి బియ్యం అమ్ముతాడు, ఆ బియ్యం ఏ రైస్‌ మిల్లులో రీసైక్లింగ్‌ అవుతాయనేది జరగమెరిగిన నగ్న సత్యం. కానీ ఈ కందుకూరు ప్రాంతంలో జరుగుతున్న బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట మాత్రం పడదు. దాడుల్లో పట్టుబడ్డ ఒక్క వ్యాపారిపై కూడా చర్యలు తీసుకోరు. నాలుగైదు సంవత్సరాలుగా ఇదంతా మామూలు విషయంగానే మారిపోయింది. కందుకూరు కేంద్రం ప్రతి నెలా టన్నుల కొద్ది బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతుంది. ఇవి రేషన్‌ డీలర్ల నుంచి కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తుండగా, మరికొందరైతే ఏకంగా సివిల్‌ సప్‌లై గూడెం నుంచే బ్లాక్‌ మార్కెట్‌కు తరలించిన సంఘటనలున్నాయి.

కందుకూరు చట్టుపక్కల ఉన్న రైస్‌ మిల్లులో రీస్లైకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. కందుకూరు పరిసర ప్రాంతంలోని ఓగూరు, లింగసముద్రం మండలం వీఆర్‌కోట, పెదపవని గ్రామాల్లోనే రైస్‌ మిల్లులు ఈ రీసైక్లింగ్‌కు కేంద్రాలుగా ఉన్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో దాదాపు దాదాపు 500 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వీఆర్‌కోట గ్రామంలోని నరశింహారావు అనే బియ్యం వ్యాపారికి చెదిన రైస్‌ మిల్లులో 380 బస్తాలను అధికారులు గుర్తించారు. వీటిలో 140 బస్తాల బియ్యం ఏకంగా సివిల్‌ సప్‌లై కార్పొరేషన్‌ లోగోతో సహా పట్టుబడ్డాయి. అలాగే ఓగూరు మిల్లు వద్ద ఉన్న మిల్లును సాంబయ్య అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. ఈ మిల్లులో 109 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

గత రెండు సంవత్సరాల వ్యవధిలో ఇదే మిల్లులపై మూడుసార్లు అధికారులు దాడులు చేసి స్వయంగా రేషన్‌ బియ్యాన్ని టన్నుల కొద్ది స్వాధీనం చేసుకున్నారు. కానీ మిల్లు మాత్రం మూతపడదు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఎన్నిసార్లు దాడుల్లో పట్టుబడినా తమకేమీ కాదనే ధైర్యంతో వీరు అక్రమ బియ్యం వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలోని రైస్‌ మిల్లులు ఈ అక్రమ బియ్యం వ్యాపారానికి కేంద్రంగా మారుతున్నాయి. ఇక్కడే రీ సైక్లింగ్‌ చేసి మార్కెట్‌లో విక్రయించడం లేదా, అదే బియ్యాన్ని సీఎంఎస్‌ పేరుతో తిరిగి సివిల్‌ సప్‌లై కార్పొరేషన్‌కే అంటగడుతున్నారు.

విచ్చలవిడిగా వ్యాపారం...
ఇటీవల కాలంలో ఈ బియ్యం అక్రమ వ్యాపారం మరీ విచ్చలవిడిగా మారిపోయింది. ఒక్క కందుకూరు ప్రాంతం నుంచే కాక పామూరు, కనిగిరి తదితర ప్రాంతాల నుంచి ఇటువైపు నుంచి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడ మిల్లుల యజమానులు స్థానికంగా కొనుగోలు చేసి అదే బియ్యాన్ని రీస్లైకింగ్‌ చేసి జిల్లా సరిహద్దులు దాటిస్తారు. లేదంటే కొందరు వ్యాపారులు నేరుగా నెల్లూరు జిల్లాలోని పలువురు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క వ్యాపారిని డీలర్లను కూడగట్టుకుని షాపులకు వచ్చే బియ్యాన్ని నేరుగా తీసుకెళ్తుంటారు. డీలర్‌కు కేజీకి రూ.12 నుంచి రూ.15ల వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా టన్నుల కొద్ది బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

తూతూ మంత్రంగా తనిఖీలు
ఇంత భారీ స్థాయిలో అక్రమ బియ్యం వ్యాపారం సాగుతున్నా, దాడుల్లో పలుమార్లు పట్టుబడ్డా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బియ్యం వ్యాపారులు టీడీపీ సానుభూతి పరులు కావడం, గత ప్రభుత్వం ఒత్తిడితో వారి వ్యాపారానికి అడ్డేలేకుండా పోయింది. రేషన్‌షాపుల్లో తనిఖీలు చేసి అక్రమాలను నిరోధించాల్సిన సివిల్‌ సప్‌లైశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అసలు పట్టించుకోరు. ఏ రేషన్‌షాపు నుంచి ఏ మిల్లుకు బియ్యం వెళ్తాయనేది తెలిసినా, దాడుల్లో సమాచారం దొరికినా ఒక్క డీలర్‌పై కూడా చర్యలు లేవు. మిల్లులు యధేచ్చగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటాయి. దీనంతటికీ ఏ శాఖకు అందాల్సిన మామూళ్లు ప్రతినెలా వ్యాపారులు ముట్టచెప్తున్నారనే విమర్శలు జోరుగా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement