ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉదయం 11.30 నుంచి 11.50 గంటల వరకు 20 నిముషాల పాటు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
దీంతో ఇరువైపులా అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళననుద్దేశించి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి, ఏపీఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రపతిని రబ్బర్‌స్టాంప్‌గా అభివర్ణించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వీగిపోయినప్పటికీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యను అన్ని రాజకీయ పార్టీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి సీమాంధ్రలోని కోట్ల మంది ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖాతరు చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తుందన్నారు.
ఓట్లు, సీట్ల కోసం తెలుగుజాతిని రెండు ముక్కలుగా కాంగ్రెస్ పార్టీ చీలుస్తోందని విమర్శించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుజాతిని ముక్కలు చేయడాన్ని నిరసిస్తూ పిల్లల నుంచి వృద్ధుల వరకు కాంగ్రెస్ చర్యలను ఎండగడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తున్న నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు ఏకతాటిపై నిలిచి తిప్పికొట్టాలని కోరారు. రాష్ట్ర విభజనకు సంబంధించి రెండు నాల్కల ధోరణితో వ్యవహరించే పార్టీలు, నాయకులకు ప్రజలు రాజకీయ సమాధి కడతారని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రపై కక్ష కట్టిందని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం నిలబడటానికి సీమాంధ్ర ప్రజలు ఎక్కువ మంది ఎంపీలను అందిస్తే..అలాంటి ప్రజలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ పెద్దలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
జాతీయ రహదారిపై రాస్తారోకో కారణంగా నిముషనిముషానికీ నిలిచిపోయే వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. నిర్వాహకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
రాస్తారోకోలో ఎడ్యుకేషన్ మినిస్టీరియల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏ స్వాములు, వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘ జిల్లా నాయకుడు కే శరత్‌బాబు, ఏపీఎన్‌జీవో అసోసియేషన్ ఒంగోలు నగర అధ్యక్షుడు సయ్యద్‌నాసర్ మస్తాన్‌వలి, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీ చెంచయ్య, కే వెంకటేశ్వర్లు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, ప్రసన్నకుమార్, సహకార శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు పీ రామారావు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు మూర్తి, నీటిపారుదల ఉద్యోగుల సంఘ కార్యదర్శి ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, స్టేట్ ఆడిట్ ఉద్యోగుల సంఘ కార్యదర్శి బీ ఏడుకొండలు, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘ నాయకుడు ఎస్‌కేబీఎన్ మీరావలి, ఏపీఎన్‌జీవో అసోసియేషన్ మహిళా విభాగం వైస్ చైర్‌పర్సన్ పీ మాధవి, నాయకులు పీ మదన్‌మోహన్, డీ నాగేశ్వరరావు, కే శివకుమార్, పీ రోజ్‌కుమార్, కే కోటేశ్వరమ్మ, షేక్ మగ్బుల్‌షరీప్, తోట శ్రీనివాస్, రామాంజనేయులు, తాడి శ్రీనివాస్, బీ కృష్ణకిషోర్, సీహెచ్ ఓంకార్, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా...జాతీయ రహదారి దిగ్బంధం
Published Thu, Feb 13 2014 3:33 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement
Advertisement