బోట్ తయారీ కేంద్రంగా బందరు
గిలకలదిండిలో బోట్ తయారీ నిపుణులు
వంద సంవత్సరాలుగా ఈ రంగంలోనే..
ఈ సంవత్సరం మూడు బోట్ల తయారీ
పోర్టు నేపథ్యంలో మత్స్యకారుల్లో ఆశలు
సరకుల రవాణా పెరుగుతుందన్న అంచనా
బోట్ల తయారీ రంగంలోనే ఉన్నారు. కొన్ని కుటుంబాలు వారసత్వంగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. గతంలో బోల్టులు లేనందున రివిట్‌మెంట్ ద్వారా బోట్లను నిర్మించేవారు. రివిట్‌మెంట్ రంగంలో స్థానికులు ఆరితేరిన వారు. ప్రస్తుతం బోల్టులతో బోట్లు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం గిలకలదిండికి ఇతర జిల్లాలవారు వచ్చి చెక్క బోట్లు తయారు చేయించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో 14 బోట్లు ఇక్కడ తయారయ్యాయి. ఒక్క బోటు తయారు చేయాలంటే 50 మంది నిపుణులు మూడు నెలలపాటు కష్టపడాల్సి ఉంటుంది. బోటు తయారీకి చెక్కతో పాటు ఫైబర్, రజన, మ్యాట్‌ను ఉపయోగిస్తారు. కాకినాడ ప్రాంతంలో చేపల వేట చేసే మత్స్యకారులు కూడా గిలకలదిండిలోనే బోట్లు చేయించుకుంటారు.
బోట్లు రెండు రకాలు
బోట్లను ఫైబర్, చెక్కతో రెండు రకాలుగా తయారుచేస్తారు. ఫైబర్ బోట్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకే (వలలు కలుపుకొని) ఈ బోటు తయారవుతుంది. చెక్క బోటు కంటే ఇది చిన్నది. ఈ బోటు ద్వారా చేపల వేట చేసేవారు తెల్లవారు జామున మూడు గంటలకు సముద్రంలోకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తారు. చెక్కబోటు తయారీకి ఉపయోగించే పాచి కర్ర (కలప)ను శ్రీకాకుళం నుంచి, ఇతర వస్తువులను కేరళ నుంచి తెప్పిస్తారు. అప్పుడప్పుడు సముద్రంలో కొట్టుకువచ్చే గుగ్గిలం కర్రను కూడా వాడతారు. పాచి కర్ర వెల అడుగు రూ.300 వరకు ఉంటుంది. ఈ కలప తేలికగా, మంచి నాణ్యతతో ఉంటుంది. గుగ్గిలం కర్ర మరింత నాణ్యంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో దొరకదు. ఒక్క బోటు తయారీకి కనీసంగా వెయ్యి అడుగుల కర్ర కావాలి. బోటు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధం కావాలంటే మొత్తం రూ.80 లక్షల వరకు ఖర్చవుతుంది. బోటు తయారీలోనే వలల ఖర్చు కలుపుతున్నారు. వలలు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతాయి. చెక్కబోటులో చేపల వేటకు వెళ్లేవారు నాలుగు నుంచి పది రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. బోటులోనే వంట చేసుకునే సదుపాయం ఉంటుంది.
తయారు చేయించేది వ్యాపారులే...
సముద్రంలో చేపల వేట చేసే బోట్లను తయారు చేయించేది వ్యాపారులే. అన్ని హంగులతో తయారైన బోటును మత్స్యకారులకు అద్దెకు ఇస్తారు. నాలుగు నుంచి ఎనిమిది మంది ఒక బోటులో వేటకు వెళ్లొచ్చు. ఈ ఏడాది తమ గ్రామంలో మత్స్యకారులకు 14 బోట్లు తయారు చేసి ఇచ్చామని బోటు తయారుదారు కొక్కిలిగడ్డ నాగాంజనేయులు తెలిపారు. రోజు కూలీ రూ.500 వస్తుందని వివరించారు.
పోలాటితిప్ప కాలువను మరమ్మతు చేయాలి
ప్రస్తుతం మత్స్యకారులు బోట్లను పోలాటితిప్ప కాలువలో లంగరేస్తున్నారు. కాలువకు ఇరువైపులా మంచి రివిట్‌మెంట్ కట్టిస్తే బోట్ల నుంచి సరకును దించుకునేందుకు కూడా వీలుగా ఉంటుందని, స్థానికులు కూడా ఇక్కడికొచ్చి చేపలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఎగుమతి దారుల కంపెనీలు ఈ దారిలోనే ఉన్నాయని, వారి గోడౌన్లు సమీపంలోనే ఉన్నందున కాలువను బాగుచేసి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.