బాబు కోసం బోగస్‌ సర్వేలు | Bogus Surveys for Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు కోసం బోగస్‌ సర్వేలు

Published Tue, May 21 2019 3:18 AM | Last Updated on Tue, May 21 2019 5:06 AM

Bogus Surveys for Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ప్రధాన సర్వే సంస్థలు, జాతీయ మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో తమ క్యాడర్‌ జారిపోకుండా ఉండేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పలు బోగస్‌ సర్వే సంస్థలను రంగంలోకి దించింది. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వస్తుందని పేరెన్నికగన్న సంస్థలన్నీ చెబుతుండగా, బోగస్‌ సంస్థలు మాత్రం మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని హడావుడి చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేలో టీడీపీ నేతల అభిప్రాయమే వినిపించింది. ఐఎన్‌ఎస్‌ఎస్, ఎలైట్‌ పేరుతో మరికొన్ని సర్వేలు అదే కోవలో బయటకు వచ్చాయి. ఇవన్నీ టీడీపీ పెద్దల కనుసన్నల్లో పని చేసేవేనని చెబుతున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వెల్లడవుతుందని ముందే తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము గెలుస్తున్నట్లు కొన్ని సంస్థలు చెబుతున్నాయని చూపించుకునేందుకు బోగస్‌ సంస్థలను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ సంస్థలు అసలు సర్వేలు చేయకుండానే చేసినట్లు బిల్డప్‌ ఇచ్చి, నోటికొచ్చిన సీట్ల లెక్కలు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. 

లగడపాటి సర్వే తీరిది.. 
రెండురోజుల నుంచి హంగామా చేస్తున్న లగడపాటి సర్వే పూర్తిగా బోగస్‌ అని సెఫాలజిస్టులు తేల్చిచెబుతున్నారు. ఆర్‌జీ ఫ్లాష్‌ టీమ్‌ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి చెబుతున్నా, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ సంస్థను నిర్వహిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్‌ తాను ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించగా, ఆయనతోనే తాను సర్వే చేయించినట్లు లగడపాటి చెబుతుండడం గమనార్హం. ఆర్‌జీ ఫ్లాష్‌ టీమ్‌ పేరుతో చేసిన సర్వే వివరాలతో లగడపాటి ఒక నోట్‌ విడుదల చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను కేవలం 38 నియోజకవర్గాల్లోనే తాము సర్వే చేశామని, 50 వేల శాంపిల్స్‌ తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అది కూడా మూడు జిల్లాల్లోనే ఈ సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు. కేవలం 38 నియోజకవర్గాల్లో సర్వే చేసి, ఫలితాలను అంచనా వేయడం ఎక్కడా జరగదని సెఫాలజిస్టులు పేర్కొంటున్నారు.

అందులోనూ లగడపాటి టీడీపీకి 90కి 20 స్థానాలు అటూ ఇటుగా వస్తాయని చెప్పడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 20 సీట్ల మార్జిన్‌తో ఫలితాలు అంచనా వేయడాన్ని బట్టి వారి సర్వేపై వారికే నమ్మకం లేదని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. చంద్రబాబుతో తెరచాటు సంబంధాలు కొనసాగిస్తూ, ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన లగడపాటి సర్వేకు ఏమాత్రం ప్రామాణికత లేదని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పగా, లగడపాటి మాత్రం మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పి అభాసుపాలైన సంగతి తెలిసిందే.  

ఆ రెండు సంస్థలూ అంతే.. 
ఢిల్లీకి చెందిన ఐఎన్‌ఎస్‌ఎస్‌ సంస్థ పేరుతో విడుదలైన సర్వే కూడా టీడీపీ నాయకుల మెదళ్ల నుంచి బయటకు వచ్చిందే. ఐఎన్‌ఎస్‌ఎస్‌ అనేది ప్రాభవం కోల్పోయిన ఒక తెలుగు దినపత్రికలో పనిచేసిన జర్నలిస్టు ఢిల్లీలో నిర్వహిస్తున్న న్యూస్‌ ఏజెన్సీ. ఢిల్లీలో అన్ని కార్యక్రమాలను కవర్‌ చేయడానికి దానికి రిపోర్టర్లే లేరు. అలాంటి సంస్థ ఏపీలో భారీ ఎత్తున సర్వే చేశామని, టీడీపీకి 118, వైఎస్సార్‌సీపీకి 52, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలినట్లు ప్రకటించింది. ప్రముఖ సర్వే సంస్థలన్నీ వైఎస్సార్‌సీపీ.. టీడీపీ కంటే 6 నుంచి 8 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుందని కచ్చితమైన లెక్కలతో వివరిస్తుండగా, ఈ సంస్థ మాత్రం వైఎస్సార్‌సీపీ కంటే టీడీపీకి 9.5 శాతం ఓట్లు ఎక్కువగా రానున్నట్లు చెప్పడాన్ని బట్టి ఇది పూర్తిగా టీడీపీ సర్వే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ‘ఎలైట్‌ ఎలక్టోరల్‌ క్యాలిక్యులస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో విడుదలైన సర్వేలో టీడీపీకి 106 సీట్లు, వైఎస్సార్‌సీపీకి 68 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇది కూడా టీడీపీ నేతలు విడుదల చేయించిన సర్వే అని సమాచారం.

ఈ రెండు సర్వే సంస్థలు రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో ఎన్ని శాంపిల్స్‌ తీసుకున్నది చెప్పకుండా కొన్ని కాకిలెక్కలతో ఫలితాలను అంచనా వేయడం గమనార్హం. టుడేస్‌ చాణక్య పేరుతో విడుదలైన మరో సర్వే టీడీపీకి 17 నుంచి 20 ఎంపీ సీట్లు, వైఎస్సార్‌సీపీకి 8 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. కొద్దిరోజుల క్రితం కార్పొరేట్‌ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి ఒక సర్వేను విడుదల చేసింది. మిషన్‌ చాణక్య సర్వే సంస్థ దాన్ని ఖండించింది. తమ పేరును పోలిన సంస్థ పేరుతో బోగస్‌ సర్వే విడుదల చేశారని పేర్కొంది. ఇప్పుడు మిషన్‌ చాణక్య సంస్థ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్‌ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయట పెట్టారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు, ఆయన కోటరీ ఉద్దేశపూర్వకంగా కొన్ని బోగస్‌ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేల వివరాలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement