నిలకడ లేని ‘నారా’జకీయం | K Ramachandra Murthy Article On Chandrababu Naidu Opportunism | Sakshi
Sakshi News home page

నిలకడ లేని ‘నారా’జకీయం

Published Sun, Feb 24 2019 1:28 AM | Last Updated on Sun, Feb 24 2019 9:28 AM

K Ramachandra Murthy Article On Chandrababu Naidu Opportunism - Sakshi

అయితే  మేనియా, లేదంటే ఫోబియా. మధ్యేమార్గం లేదు. మేనియా అంటే పిచ్చి ప్రేమ. నిర్హేతుకమైన అభిమానం. ఫోబియా అంటే గుడ్డి వ్యతిరేకత. మితిమీరిన ద్వేషం. రెండూ తీవ్రమైన మానసిక ధోరణులే. సాధారణంగా కొందరు వ్యక్తులకు కొందరంటే మేనియా ఉంటుంది. కొందరిపట్ల ఫోబియా ఉంటుంది. ఒకే వ్యక్తికి రెండు లక్షణాలూ ఉండవలసిన పని లేదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి దాదాపు శాశ్వతంగా ఉంటాయి. అభ్యాసం వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిలో ఈ రెండు లక్షణాలూ ఏకకాలం ప్రకోపించే నైజం ఉంది. ఒకరిని విపరీతంగా అభిమానిస్తారు. అదే సమయంలో మరొకరిని హద్దులు మీరి ద్వేషిస్తారు. 

ఒక వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల కొంతకాలం మేనియా ప్రదర్శించి కొంతకాలం తర్వాత అదే వ్యక్తి లేదా వ్యవస్థ పట్ల అంతే స్థాయిలో ఫోబియా చూపించడం ఆయన ప్రత్యేకత. ఉదాహరణకు 2014 జూన్‌ నుంచి 2018 మార్చి వరకూ నరేంద్రమోదీ దేశానికి ప్రధానమంత్రులుగా పని చేసిన వారందరిలోకీ ఉత్తముడు. ఘటనాఘటన సమర్థుడు. ప్రపంచంలో భారత దేశా నికి సమున్నత స్థానం సంపాదించిన రాజకీయవేత్త. తన సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనం అంతుచూసేందుకు సాహసోపేతమైన చర్య తీసు కున్న దురంధరుడు. గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (జీఎస్‌టీ)ని అత్యంత లాఘవంగా అమలులోకి తెచ్చిన నేర్పరి. స్నేహం చెడి, బంధం వీడి, ప్రత్యర్థులుగా మారిన తర్వాత అదే మోదీ పనికిరాని ప్రధాని. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిని నిరోధించలేకపోయిన అసమర్థుడు. 

ఉగ్రవాద దాడిపై అనుచిత వ్యాఖ్య
ఎన్నికలు రెండు మాసాల దూరంలో ఉన్నాయనగా ప్రజలలో దేశభక్త్యావేశం నింపడానికి ఉగ్రవాదుల దాడిని పనికట్టుకుని జరిపించారా అని అనుమానం కలుగుతోందనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతాబెనర్జీ కూడా అదే ఫక్కీలో కేంద్రం నిజాయతీని శంకించారు. వీరిద్దరి కంటే పంజాబ్‌ మంత్రి నవజోత్‌ సిద్ధూ నయం. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సిద్ధూ అనడం సమయోచితం కాకపోయినా అర్థం లేని బాధ్యతారహితమైన వ్యాఖ్య కాదు. నిర్మాణాత్మకమైనదీ, ఆవేశాలు చల్లారిన అనంతరం ఆచరణయోగ్య మైనదీ. గోధ్రా అమానుషం, అనంతర మారణహోమం జరిగింది 2002లో. 

2014లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నారావారికి మోదీ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరకరమైన అంశం కనిపించలేదు. గుజరాత్‌ నరమేధం గుర్తురాలేదు. ఎట్లాగైనా గెలవడం ప్రధానం. అందుకే సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్ళి మరీ మద్దతు కోరారు. మొత్తంమీద స్వల్ప ఆధిక్యంతో ఎన్నికలలో గెలిచారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో భాగస్వామ్యం నెరిపారు. నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)నుంచి వైదొలిగిన తర్వాత గుజరాత్‌ మారణకాండ, నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ప్రవచించిన రాజధర్మం నారావారికి జ్ఞాపకం వచ్చాయి. దీనినే మనోవైజ్ఞానిక శాస్త్రంలో సెలక్టివ్‌ ఆమ్నీసియా (ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరచిపోవడం) అంటారు. ఇది కూడా ఒకానొక మానసిక లక్షణమే. మేనియా ఉన్నంతకాలం ఆకాశానికి ఎత్తడం, మేనియా దిగిపోగానే నేలకేసి కొట్టడం.

మోదీ పట్ల ఆరాధనాభావం ఉన్న కాలంలోనే కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ పట్ల ద్వేషభావం ఉండేది.  నరేంద్రమోదీని అవధులు లేకుండా అభిమానిస్తున్న రోజుల్లో కాంగ్రెస్‌ చెత్తపార్టీ. సోనియాగాంధీ ఇటలీ రాక్షసి. మాఫియోజీ. ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ అసమర్థుడు. పప్పు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌. రాహుల్‌గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే, ‘ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? ఇక్కడ ప్రజలు బతికున్నారో, చచ్చారో చూడటానికి వచ్చారా?’ అంటూ ఉతికి ఆరేశారు. అదంతా కాంగ్రెస్‌ ఫోబియా ఉన్న రోజుల్లో వైఖరి. ఫోబియా మోదీపైకి మళ్ళి మేనియా సోనియా, రాహుల్‌ వైపు బదిలీ కావడంతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల తీరు కూడా అక స్మాత్తుగా మారింది. తన ప్రయోజనాలు నెరవేర్చనందుకు మోదీని ఓడించాలని చంద్రబాబు తీర్మానించుకున్నారు. ప్రతిష్ట క్రమంగా కోల్పోతున్న నరేంద్ర మోదీని మోయడం కంటే మోదీకి ఎదురు తిరిగి అతడిని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించిన ప్రతినాయకుడు (విలన్‌)గా అభివర్ణించాలి. మీడియా సహకారంతో ప్రజలను నమ్మించాలి. 

హస్తినపై పోరాటమా, ఆరాటమా?
కేంద్రంపైన యుద్ధం ప్రకటించడం ద్వారా ప్రజల తరఫున అన్నిటికీ తెగించి పోరాడుతున్న యోధుడిలాగా కనిపించాలి. ఓటర్లను మెప్పించి మరోసారి అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పదవిలో కొన సాగాలి. వీలైతే తనయుడు లోకేష్‌ను గద్దెపైన కూర్చోబెట్టాలి. అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో రాహుల్‌గాంధీ నాయకత్వంలో యూపీఏ–3 ప్రభుత్వం ఏర్ప డితే హస్తినలో చక్రం తిప్పాలి. ఇదీ చంద్రబాబు వ్యూహం. మోదీని ఓడించడం కోసం రాహుల్‌ని భుజానికి ఎత్తుకుని మోయడానికి అభ్యంతరం లేదు. సొంత బలంతో ఏదీ సాధించే అవకాశం లేదు కనుక ఏదో ఒక జాతీయ పార్టీ  సహకారం అనివార్యం. కేంద్రంలో గణనీయమైన పాత్ర పోషించాలంటే తక్కిన ప్రాంతీయపార్టీలను తానే ప్రభావితం చేసి నడిపిస్తున్నారనే అభిప్రాయం కలిగించాలి. 

అందుకే ప్రత్యేక విమానంలో బెంగళూరుకూ, భువనేశ్వర్‌కూ, కోల్‌కతాకూ చక్కర్లు కొట్టడం. మాయావతినీ, అఖిలేష్‌నీ యూపీఏ పరిష్వంగంలోకి తీసుకుని వస్తానంటూ రాహుల్‌కి వాగ్దానం చేశారు. అన్నీ కలసి వస్తే శరద్‌పవార్‌ మూడు దశాబ్దాల  స్వప్నం సాకారమై ఆయనే ప్రధాని కావచ్చునంటూ మరాఠా యోధుడి చెవులో చెబుతారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో రెండు విడతల  ప్రభంజనం సృష్టించిన మమతాబెనర్జీ ప్రధాని పదవికి నూటికి నూరుపాళ్ళు అర్హురాలంటూ ఆమెలో ఆశలు రేకెత్తిస్తారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రతిపక్షాల కూటమి ఖాయ మంటూ ఆమెతో అంటారు. 

ఏ రోటి కాడ ఆ పాట. మమతను ప్రసన్నం చేసుకోవడానికి రెక్కలు కట్టుకుని కోల్‌కతాలో వాలడానికి సిద్ధం. మాయావతి ఆశీస్సుల కోసం ఢిల్లీ కానీ లక్నో కానీ వెళ్ళడానికి తయారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా వ్యవహరించినప్పుడు కూడా ఇదే తీరు. అందుకే మొన్న ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో పన్నెండు గంటల దీక్ష సమయంలో సమాజ్‌వాదీపార్టీ వ్యవ స్థాపకుడు ములాయంసింగ్‌ మాట్లాడుతూ, ‘ప్రధానమంత్రిగా మీరు ఉండాలంటూ నాయుడూజీ నాతో అన్నారు’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత అదే ములాయం లోక్‌సభ చివరి రోజు సమావేశంలో మాట్లాడుతూ నరేంద్రమోదీ మళ్ళీ విజయం సాధించి ప్రధానిగా కొనసాగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అది వేరే విషయం. 

బీజేపీ అగ్రనాయకద్వయం మోదీ– అమిత్‌షా తక్కువేమీ తినలేదు. గుజరాత్‌ గాయం తర్వాత తనను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేసిన సంగతి మోదీ విస్మరించజాలరు. తాను హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్టు చేస్తానంటూ నాటి సిటీ పోలీసు కమిషనర్‌తో చంద్రబాబు చెప్పించిన విషయం మరచిపోలేదు. కానీ ఎట్లాగైనా విజయం సాధించి అధికారం కైవసం చేసుకోవాలన్న ఏకోన్ముఖదీక్షతో చంద్ర బాబుతో దోస్తీకి మోదీ అంగీకరించారు. ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత తనపైన వాగ్బాణాలు ఎక్కుపెడుతున్న చంద్రబాబు గతం మోదీకీ, అమిత్‌షాకీ అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. 

ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వారికి ఇప్పుడు కనిపిస్తున్నారు. అవినీతికి ప్రతీకగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దర్శనమిస్తున్నారు. అవకాశవాదం మూర్తీభవించిన నేత కళ్ళకు కడుతున్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటికి వెళ్ళి శాలువా కప్పి స్నేహం ప్రకటించిన చంద్రబాబు టీడీపీతో మూడున్నర దశాబ్దాలు నిరంతర పోరాటం చేసిన కాంగ్రెస్‌ యోధులకు దేవుడిలాగా కనిపిస్తున్నారు. ‘గతం గతః’ అంటూ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్, టీడీపీ మధ్య వైరాన్ని చాలా తేలికగా కొట్టిపారవేశారు.

తలాతోకాలేని మాటలు
ఈ మధ్య చంద్రబాబు తమాషా వ్యాఖ్యలు చేస్తున్నారు. తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. పద్నాలుగు మాసాలకు పైగా పాదయాత్ర చేసిన మిత్రుడు జగన్‌మోహన్‌రెడ్డిని పలకరించడానికి సినీహీరో అక్కినేని నాగార్జున లోటస్‌ పాండ్‌కు వెడితే, ‘నాగార్జునకు ఏమైనా అవసరాలు ఉంటే నా దగ్గరికి రావచ్చు. ముఖ్యమంత్రి హోదాలో సహాయం చేస్తా. నేరస్థులను కలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెడతాయి’ అంటూ చిత్రంగా వ్యాఖ్యానించారు. సోనియా పనుపున తాను, చిదంబరం కలసి సీబీఐ చేత పెట్టించిన బూటకపు కేసులు ఏవీ కోర్టులో నిలవజాలవని చాలామంది న్యాయశాస్త్ర ప్రవీణులు అన్నారు. నిర్దోషిగా జగన్‌ మోహన్‌రెడ్డి కేసుల నుంచి విముక్తి పొందుతారని చంద్రబాబుకీ  తెలుసు. నిందితుడికీ, దోషికీ తేడా పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఒక ముఖ్య మంత్రికి తగదని ఆయనకు వేరొకరు చెప్పనక్కరలేదు. 

కానీ ఆయన మానసిక స్థితి ఆయనను నిలువనీయదు. జగన్‌మోహన్‌రెడ్డి ఫోబియా చంద్రబాబుచేత ఏది పడితే అది మాట్లాడిస్తుంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న కుమార్తెను చూసివచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు లండన్‌ వెడితే హవాలా డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్ళారంటూ నోరుపారేసుకోవడం ఆయనలో నానాటికీ పెరుగుతున్న అభద్రతాభావం కారణంగానే. సింగపూరులో ఆర్థిక ప్రయోజనాలు చంద్రబాబుకి ఉన్నాయనీ, అందుకే ప్రతిపక్షంలో ఉన్న కాలంలో సైతం ఆ దేశం సందర్శించేవారనీ అందరూ అంటారు. చంద్రబాబు లాగా ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసేవారికి సింగపూర్‌ నుంచి కానీ అమెరికా నుంచి కానీ హవాలా డబ్బు తీసుకురావడం తేలిక. 

ఒక వైపు మోదీ, మరోవైపు పవన్‌ కల్యాణ్‌ సహాయం చేస్తేనే 2014లో బొటాబొటి ఓట్లతో గెలుపొందిన టీడీపీకి ఈ సారి బీజేపీతో పొత్తు లేదు. పవన్‌కల్యాణ్‌ నాయకత్వం లోని జనసేనతో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టం కాలేదు. పొత్తు ఉంటుందని అనుకున్నప్పటికీ అది పరాజయం నుంచి కాపాడలేదు. అయిదేళ్ళు అధికారంలో ఉండి సంపాదించుకున్న ప్రజావ్యతిరేకత టీడీపీ విజయావకాశాలను మరింత క్షీణింపజేసింది. అధికారంలో ఉండగా సాధించామని చెప్పుకోవ డానికి ఒక్కటీ లేదు. జాతీయ మీడియా సంస్థలూ, సర్వే సంస్థలూ ఇంతవరకూ జరిపిన అన్ని సర్వేలలోనూ వైఎస్‌ఆర్‌సీపీ ఘనవిజయం సాధించబోతోందని చాటుతున్నాయి.

తాజాగా ‘ఇండియా టుడే’ సర్వేలో వైఎస్‌ఆర్‌సీపీకి టీడీపీ కంటే ప్రజాదరణలో తొమ్మిది శాతం ఆధిక్యం ఉన్నట్టు తేలింది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకుంటున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను బలవంతం చేసి తెలంగాణ ఎన్నికల ముందు ఫలితాలు చెప్పించిన సర్వే వంటి సర్వేలు కావు ఇవి. సాధారణంగా వార్తలూ, వ్యాఖ్యల విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించే జాతీయ టీవీ చానళ్ళే ఈ సారి ఆయన పరాజయం ఖాయమని అంటున్నాయి. మీడియాను కానీ మరో వ్యవస్థను కానీ సుముఖం చేసుకొని ‘మేనేజ్‌’ చేసే విద్య చంద్రబాబుకి ఉన్నదనే విషయం లోకానికి తెలుసు. అటువంటి విద్య జగన్‌మోహన్‌రెడ్డికి బొత్తిగా లేదు. తాను చేసే అక్రమాలనూ, మోసాలనూ ప్రత్యర్థులకు ఆపాదించి నిందించడం జగన్‌ మోహన్‌రెడ్డికి అలవాటంటూ చంద్రబాబు మరో విమర్శ చేశారు. 

తెలంగాణలో టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు సంతలో పశువులాగా అమ్ముడుపోయారంటూ నిందించిన చంద్రబాబు 23 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలను ఎడాపెడా కొనేశారు. బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారంటూ, పశువుల కంటే హీనంగా ఎంఎల్‌ఏలు అమ్ముడుపోతున్నారనీ, ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారనీ చంద్రబాబు తీవ్రమైన ఆవేదన వెలి బుచ్చారు. ఆయనలోని అపరిచితుడు ఎప్పుడు బయటికి వచ్చి ఏమి అంటాడో ఆయనకే తెలియదు. తాను వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలచేత పార్టీ ఫిరాయింప జేసిందీ, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిందీ చంద్రబాబు మరచిపోయి ఉంటారా? అది సెలక్టివ్‌ ఆమ్నీసియా ఫలితమా? మనోవైజ్ఞానిక  శాస్త్రవేత్తలే చెప్పాలి.

-కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement