లగడపాటి చిలుక పలుకులు.. | Lagadapati fake survey for Chandragiri Repolling | Sakshi
Sakshi News home page

మళ్లీ చిలుక జోస్యం

Published Sun, May 19 2019 4:18 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

Lagadapati fake survey for Chandragiri Repolling - Sakshi

విలేకరుల సమావేశానికి ముందు టీడీపీ నేతలు జూపూడి ప్రభాకర్, అశోక్‌బాబులతో ముచ్చటిస్తున్న లగడపాటి

సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ పెంపుడు చిలుక మళ్లీ పలికింది. స్వామికార్యంతోపాటు స్వకార్యం సాధించుకోవడానికి హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె ఉన్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివారం రీపోలింగ్‌ జరగనుండడంతో పెంపుడు చిలుకను పంజరం నుంచి వదిలారు. ఈ రీపోలింగ్‌లో ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించి, తన యజమానికి లాభం చేకూర్చడమే లక్ష్యంగా ఆ చిలుకు కొన్ని పలుకులు వినిపించింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని ఇప్పటికే తేటతెల్లం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా చూడ్డానికి, తామే అధికారంలోకి వస్తున్నామంటూ జోస్యం చెప్పి, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ఎన్నికల సిబ్బందిని భయపెట్టి లొంగదీసుకోవడానికి చిలుకను ప్రయోగించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఓవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను నమ్మొద్దని చెబుతూనే లగడపాటి రాజగోపాల్‌తో చిలుక పలుకులు పలికిస్తుండడం గమనార్హం. 

ఏపీలో తెలుగుదేశమే గెలుస్తుందట! 
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెట్టింగ్‌లు కాసి, సొమ్ము చేసుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గూటి చిలుక లగడపాటి రాజగోపాల్‌ పెద్ద స్కెచ్‌ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించబోతున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆయన ఢంకా బజాయించారు. దాంతో బెట్టింగ్‌ రాయుళ్లంతా మహా కూటమి గెలుస్తుందంటూ పందేలు కాశారు. కానీ, లగడపాటి మాత్రం తన అనుచరులతో అధికార టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యమంటూ బెట్టింగ్‌లు కాసేలా జాగ్రత్తపడినట్లు విమర్శలు వినిపించాయి. చివరకు టీఆర్‌ఎస్‌ నెగ్గడంతో బెట్టింగ్‌ల్లో లగడపాటి మనుషులు భారీగా ఆర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని లగడపాటి అమలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలవడడానికి 24 గంటల ముందు, ఎన్నికల ఫలితాల వెల్లడికి నాలుగు రోజుల ముందు శనివారం సాయంత్రం 6 గంటలకు మీడియాతో మాట్లాడారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని తమ సర్వేలో తేలినట్లు సంకేతాలిచ్చారు. 

తెలంగాణలో చిలుక జోస్యాలు నమ్మి నష్టపోయాం.. 
ఆదివారం సాయంత్రం 6 గంటలకు జాతీయ టీవీ చానళ్లతోపాటు సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తరువాత లగడపాటి చిలుక జోస్యాలను నమ్మి బెట్టింగ్‌లు కాసేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి ఉండదని, అందుకే పెంపుడు చిలుకు ముందే కూసిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని జాతీయ టీవీ చానళ్లతోపాటు పలు సర్వే ఏజెన్సీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో కూడా ఇదే విషయం వెల్లడి కానుంది. పందేంరాయుళ్లను టీడీపీ వైపు మళ్లించి, తన మనుషులతో వైఎస్సార్‌సీపీ గెలుపుపై బెట్టింగ్‌లు కాసేలా చేయడమే లగడపాటి ఉద్దేశమని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్‌ జోస్యాలను నమ్మి, పందేలు కాసి దెబ్బతిన్నామని, భారీగా నష్టపోయామని పలువురు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్‌ల్లో లాభాల కోసమే లగడపాటి ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

ఓటర్లను ప్రభావితం చేయడానికే ‘సైకిల్‌’ 
చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌లో 6,000 మంది ఓట్లు వేయాల్సి ఉంది. ఈ రీపోలింగ్‌లో ఓటర్లను ఎలాగైనా ప్రభావితం చేయాలని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వరాదని సీఎం చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే తన చిలుక లగడపాటిని ఎగ్జిట్‌ పోల్స్‌కు 24 గంటల ముందే రంగంలోకి దించారు. బాబు వ్యూహంలో భాగంగానే ఓటర్లను టీడీపీ వైపు మళ్లించడానికి లగడపాటి సైకిల్‌ అనే పదం ఉపయోగించారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చిలుక జోస్యాల కోసం లగడపాటికి ఇప్పటిదాకా రూ.1,240 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను చంద్రబాబు కట్టబెట్టారు. శనివారం విలేకరుల సమావేశానికి ముందు లగడపాటితో పలువురు టీడీపీ నాయకులు గంటల పాటు మంతనాలు జరపడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement