
సాక్షి, తిరుమల : ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. రేపటి(గురువారం) ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే దొంగ సర్వేనని, ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. లగడపాటి సర్వేను ప్రజలు నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్ జగన్ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment