చిన బొండపల్లిలో అలుముకున్న విషాదం | Bondapalli suite that had built up in the tragedy | Sakshi
Sakshi News home page

చిన బొండపల్లిలో అలుముకున్న విషాదం

Published Thu, Sep 26 2013 6:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

Bondapalli suite that had built up in the tragedy

చినబొండపల్లి(పార్వతీపురం రూరల్), న్యూస్‌లైన్: పట్టుమని పదేళ్లు కూడా నిండని పిల్లలు వారు... అప్పుడే నూరేళ్లూ నిండిపోయాయి. నిత్యం కలిసి ఉండే వారితో విధి ఆడుకుంది. ఇప్పుడే వస్తామంటూ వెళ్లిన ఆ చిన్నారులు.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ‘‘చదువులో నూ, ఆటల్లోనూ...చివరికి మృత్యువులోనూ తోడు వీడలేదా బాబూ... ఏ పాపిష్టి కళ్లు మీ మీద పడ్డాయి నాయనా... ప్రయోజకులై ఆదుకుంటారనుకున్నామే... ఇలాగేనా ఆదుకునేది...?’’ అంటూ రోది స్తున్న ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరి తరమూ కాలేదు. మండలంలోని చినబొండపల్లి గ్రామానికి చెందిన నీలబోను మనోజ్(7), పిన్నింటి శరత్(8) బుధవారం ఆ గ్రామంలోని చెరువులో పడి మృతి చెందారు. ఈ వార్త విన్న గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయిం ది. చినబొండపల్లి గ్రామానికి చెందిన నీలబోను పుష్ప కుమారుడు మనోజ్.. పిన్నింటి గంగులు, సింహాచలమమ్మ కుమారుడు శరత్‌లు వరసకు బావబావమరుదులు. 
 
 ఒక్క ఏడాది తేడాతో పుట్టిన వీరిద్దరూ ఆట, పాటల్లోనే కాదు.. చదువులోనూ జంటగా ఉండేవారు. చూసిన ప్రతిఒక్కరూ ‘మీరిద్దరూ కృష్ణార్జునుల్లా ఉన్నార్రా...? కలకాలం ఇలాగే ఉండాలిరా...’ అని అనే వారు. బుధవారం ఉదయం వరకూ ఇంటి వద్దే ఆడుకున్న వారు.. 10 గంటల ప్రాంతంలో ‘అమ్మా...! ఇప్పుడే వస్తామం’టూ వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలవుతున్నా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించా రు. ఎక్కడా కానరాకపోవడంతో ఊరి పొలిమేరల్లో గాలించారు. చివరికి ఊరి చివరనున్న ఎల్లంనాయుడు చెరువులో విగతజీవులుగా కనిపించడంతో కట్టలు తెంచుకున్న వారి ఆవేదనను ఎవరికీ అదుపు చేయతరం కాలేదు. నిత్యం కళ్లముందు ఆడుతూ, పాడుతూ జంటగా కనిపించే వీరిద్దరి మరణవార్త విన్న గ్రామమంతా చెరవుగట్టుకు చేరుకుని రోదించింది. 
 
 నాడు భర్త... నేడు కొడుకు...
 జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త సింహాచలం... కొడుకు పుట్టిన ఏడాదికే మృత్యువాత పడ్డాడు. ఆ కొడుకే సర్వస్వమని నీలబోను పుష్ప జీవిస్తోంది. ఉన్న ఒక్కగానొక్కకొడుకు మృత్యువాత పడడంతో ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. నాయనా...మనోజ్...! తోడు(భర్త) పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా...నీవే అన్నీ అనుకున్నానురా...ఇలా నన్ను ఒంటరిని చేసి వెళ్లేందుకు నీకు మనసెలా ఒప్పిందిరా...  ఓ దేవుడా... నా బిడ్డనొదిలి నన్ను తీసుకుపోరాదా...? అంటూ ఆ మాతృమూర్తి రోదించిన తీరు అక్కడివారిని తీవ్రంగా కలిచివేసింది.  
 
 మీకేటి బాబు, పాప...అన్నారే...?
 ‘మీకేటి బాబు...పాప...’ అని అంతా అన్నారే ...? ఇప్పుడు చూడండి మా బాబు శరత్ అందనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ  తల్లిదండ్రులు గంగులు, సింహాచలమమ్మలు గుండెలు బాదుకుని ఏడుస్తుంటే.. ఆపే ధైర్యం ఎవరూ  చేయలేకపోయారు.
 
 ఈత సరదా వల్లేనా... ?
 ఊరి శివారున ఉన్న ఈ చెరువులో సాధారణం గా ఎవరూ దిగరు. అయితే ఆడుతూ వెళ్లిన వీరిద్దరూ ఈత సరదా కోసం దిగి మృత్యువాతా పడ్డారా...? లేక ఆడుకుంటూ జారి పడ్డారా...? అనేది తెలియరాలేదు. 
 
 పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి...
 ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై డి.దీనబంధు మనోజ్, శరత్‌ల మృతదేహాలను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మనోజ్, శరత్‌లకు జంటగా దహన సంస్కారాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement