
ఆరు నూరైనా కొవ్వొత్తులు వెలిగిస్తాం
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆరు నూరైనా కొవ్వొత్తుల ర్యాలీ శాంతి యుతంగా నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనా రాయణ స్పష్టం చేశారు. విశాఖలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఆర్కే బీచ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా బీచ్ రోడ్డుకు వస్తారని ఆయన వివరించారు.కుట్రలుంటాయి జాగ్రత్త... ప్రత్యేక హోదాను వ్యతిరేకించే కొన్ని శక్తులు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉద్యమాన్ని విఫలం చేసేందుకు కుట్రలు పన్నే అవకాశం ఉందని అలాంటి వాటికి లొంగకుండా జాగ్రత్తగా గమనించాలని బొత్స సూచించారు.
హోదా కోసం పోరాడాల్సింది పోయి.. చేస్తున్నవారిని అణచి వేయాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రజల బాగు కోరుకుంటే ఉద్యమానికి అడ్డుపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాము బాధ్యత వహిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశమంతా రెడ్ అలెర్ట్ ప్రకటించాం కాబట్టి శాంతియుత ర్యాలీలు కూడా చేయకూడదంటే శాంతి భద్రతలు విఫలమైనట్టేనన్నారు. తామేమీ ఆయుధాలు చేతపట్టి ఉద్యమం చేయడం లేదని, చీకటిలో ఉన్న రాష్ట్రానికి వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నామని చెప్పారు. ఉదయం పూట గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటంకం లేకుండా ఉండాలనే తాము సాయంత్రం వేళ ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు. భాగస్వామ్య సదస్సులో గతేడాది చేసుకున్న ఒప్పందాల్లో 40 శాతం పెట్టుబడులు వచ్చాయని సీఎం చెబుతున్న మాటలకు ఆధారాలు చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బొత్స సవాల్ చేశారు. కొవ్వొత్తుల ర్యాలీకి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు.