బౌద్ధారామాల ప్రవేశ ద్వారం మూసివేసిన దృశ్యం
పశ్చిమగోదావరి,కామవరపుకోట: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గుంటుపల్లి బౌద్ధారామాల సందర్శన ఇంకా ప్రారంభం కాలేదు. గత ఆదివారం గుంటుపల్లి గుహల వద్ద భీమడోలు మండలానికి చెందిన శ్రీధరణి అనే యువతి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడం కోసం గుంటుపల్లి సందర్శనను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ విషయం తెలియని పలువురు సందర్శకులు గుంటుపల్లి వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. సాధారణ రోజులతో పోల్చుకుంటే శని, ఆదివారాల్లో గుంటుపల్లి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆదివారం గుంటుపల్లికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను సిబ్బంది అనుమతించలేదు.
దీంతో పదుల సంఖ్యలో వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు కుటుంబాలతో, స్నేహితులతో వస్తున్నారు. పోలీసు ఆంక్షల నేపథ్యంలోలో గుంటుపల్లి బౌద్ధారామాలు ఇంకా తెరుచుకోలేదు. నూజివీడు నుంచి వచ్చిన మహ్మద్ షఫీ కుటుంబం గతంలో ఇక్కడికి వచ్చినట్టు బౌద్ధారామాలు పరిసరాలు ఆకర్షనీయంగా ఉండటంతో కుటుంబసభ్యులతో వచ్చినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా మహాశివరాత్రి పర్వదినం సందర్శంగా గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఉన్న ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో వీరిని కూడా అనుమతించకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సిబ్బందిని పరిశీలిస్తే పోలీసు అధికారులు అనుమతి ఇస్తేనే లోనికి పంపిస్తామని చెప్పారు.
ఆంక్షలతో కూడిన అనుమతి
బౌద్ధారామాల సందర్శనకు ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బౌద్ధగుహలకు ఒక మార్గం ద్వారానే సందర్శకులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇతర మార్గాలను ముళ్ల కంచెలతో మూసివేశారు. కుటుంబ సభ్యులు కాకుండా జంటగా వెళ్లే వారి నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. హత్యోదంతం నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేయనున్నారు. సందర్శకులు నిబంధనలు పాటించకపోతే వెనుదిరగాల్సిన పరిస్థితి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment