గిఫ్ట్‌'బాక్స్‌' గిల్లుడు | 'box tenders' In the medical health department | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌'బాక్స్‌' గిల్లుడు

Published Wed, Dec 13 2017 3:12 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

'box tenders' In the medical health department - Sakshi

సాక్షి, అమరావతి : వైద్య ఆరోగ్య శాఖ అక్రమాలకు ఆలవాలంగా మారింది. అక్రమార్కులకు కోట్లు ఆర్జించిపెడుతోంది. ఈ శాఖలో పారదర్శకంగా ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా జరగాల్సిన వైద్య పరీక్షల టెండర్లను ‘బాక్స్‌ టెండర్లు’గా మార్చేసి కమీషన్లు ఇచ్చినవారికి  లబ్ధి చేకూర్చుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని కుటుంబ సంక్షేమ విభాగంలో గత మూడున్నరేళ్లలో బాక్స్‌ టెండర్ల ద్వారా రూ.1,827 కోట్ల విలువైన పనులను నచ్చిన వారికి కట్టబెట్టారు. రాష్ట్రంలో ఏ విభాగమైనా కాంట్రాక్టు పద్ధతిలో రూ.5 లక్షలు దాటిన పనులను టెండర్ల ద్వారా కేటాయించాలంటే ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని పాటించాలనే స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీ చిన్న టెండర్లకు మాత్రం ఇ– ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిని, ఎక్కువ కమీషన్లు వచ్చే వాటికి బాక్స్‌ టెండర్ల పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. సింపుల్‌గా బాక్సులో వేసి టెండర్లను దక్కించుకునేందుకు కుటుంబ సంక్షేమ విభాగం వేదికైంది. టీడీపీ అధికారంలోకి వచ్చేదాకా ఈ సంస్థ ద్వారా టెండర్లు  ఇ–ప్రొక్యూర్‌మెంట్‌లోనే జరిగాయి. ఆ తర్వాత బాక్స్‌ టెండర్ల పద్ధతిని పట్టాలెక్కించి అనుకున్నవారికి రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నారు.

కమిషనర్‌ ఆధ్వర్యంలో బాక్స్‌ టెండర్లు
2014 జూన్‌ తర్వాత ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానానికి స్వస్తి చెప్పడమే కాకుండా రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)ని పూర్తిగా పక్కన పెట్టారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలోనే నేరుగా బాక్స్‌ టెండర్లను పిలవడం, తమకు నచ్చిన కంపెనీలకు ముందే సమాచారమివ్వడం, వారికే పనులు కట్టబెట్టడం జరుగుతోంది. కొన్ని కేసుల్లో నేరుగా కోర్టులు జోక్యం చేసుకుని జరిమానాలు విధించినా వైద్య ఆరోగ్యశాఖ తీరు మారకపోవడం గమనార్హం.

ఆన్‌లైన్‌ కాదు.. ఆఫ్‌లైన్‌లోనే టెండర్లు
రాష్ట్రంలో చాలావరకు ఆరోగ్య పథకాలు జాతీయ ఆరోగ్యమిషన్‌ నిధులతోనే కొనసాగుతున్నా కనీసం టెండర్లకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం లేదు. నిబంధనల ప్రకారం టెండర్లను గ్లోబల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. కానీ ఏ ఒక్క టెండరునూ ఆన్‌లైన్లో నిర్వహించలేదు. ఉదాహరణకు ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలకు సంబంధించి ఎన్‌హెచ్‌ఎం కేవలం 10 కేంద్రాలకు మాత్రమే అనుమతించగా.. రాష్ట్ర ప్రభుత్వం 222 కేంద్రాలకు అనుమతించి బాక్స్‌టెండర్ల ద్వారా ఇచ్చేసింది. పోనీ అక్కడ వైద్యం అందుతోందా అంటే అదీ లేదు. ఏ ఒక్క కేంద్రంలోనూ టెలీమెడిసిన్‌ వ్యవస్థ లేదు. పైగా ఈ టెండర్లు తమ వారికి కట్టబెట్టేందుకు మూడుసార్లు రద్దుచేశారు.

నచ్చిన కంపెనీలకు ఇస్తే ఇలా నష్టం
కమీషన్లు, ముడుపుల కోసం వైద్య పరీక్షలను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తే ఎలా నష్టమో రక్తపరీక్షల నిర్వహణే చెబుతుంది. ఒక్కసారి రక్తనమూనా పరీక్షిస్తే రూ.235గా  నిర్ణయించారు. ఇందులో 15 పరీక్షలు చేస్తారు. ఒక్క పరీక్ష చేసినా రూ.235 చెల్లించాలి. ఉదాహరణకు మూత్ర పరీక్ష చేస్తే 6 రూపాయలు ఖర్చవుతుంది. ఎక్కువ మంది వైద్యులు రెండు లేదా మూడు పరీక్షలు రాస్తున్నారు. దీనికి రూ.35 నుంచి రూ.40  ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంటే ఒక్క రక్తనమూనాల మీద కనీసం రూ.200 ఆ సంస్థకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

కోర్టు మొట్టిక్కాయలు వేసినా...
గర్భిణులకు ప్రత్యేకంగా నిర్వహించే అల్ట్రా సోనాలజీ పరికరాలకు టెండర్లు పిలిచారు. ఇందులో ఎన్‌ఆర్‌ఐ అనే సంస్థ ఎల్‌1గా వచ్చింది. అయితే రాత్రికి రాత్రే టెండర్లు రద్దు చేసి మరో సంస్థకు ఇచ్చారు. దీంతో ఎల్‌1 బిడ్డరు కోర్టుకు వెళ్లారు. దీన్ని పరిశీలించిన కోర్టు ప్రభుత్వానికి రూ.10 వేలు జరిమానాతో పాటు ఎల్‌1 బిడ్డరుకు నష్టపరిహారం చెల్లించాలని, టెండర్లు పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించింది. ఇదొక్కటే కాదు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, 108, చంద్రన్న సంచార చికిత్స టెండర్లకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అధికారులు రోజూ ఏదో ఒక కేసులో హైదరాబాద్‌లో హైకోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. ఇప్పటికే పలు టెండర్లపై విజిలెన్స్‌కి, ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.


ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ఇలా...
ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ అంటే ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా టెండర్లు నిర్వహించడం. టెండర్లు దాఖలు చేయడం నుంచి ఫైనాన్షియల్‌ బిడ్‌లు ఓపెన్‌ చేయడం వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయాలి. బిడ్డర్లు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి బిడ్డర్‌కు ప్రత్యేక కోడ్‌ ఇస్తారు. సాంకేతిక బిడ్‌లు, ఫైనాన్షియల్‌ బిడ్‌లు ఇలా ఎవరు ఎంత కోట్‌ చేశారు అన్నది ఫలితాలు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. బిడ్డర్ల లైసెన్సుల నుంచి వార్షిక ఆదాయం, టర్నోవర్‌ వరకూ ఆన్‌లైన్‌లో పెట్టాలి. నిబంధనలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించినా ఆన్‌లైన్‌లో స్వీకరించే అవకాశం ఉండదు. కొనుగోళ్ల విలువ కనిష్టంగా రూ.5 లక్షలు దాటితే ఇ–ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలనేది జీఎఫ్‌ఆర్‌ (జనరల్‌ ఫైనాన్స్‌ రూల్స్‌) స్పష్టంగా చెబుతున్నాయి. దీనికి పలువురు అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ, అధికారిక కమిటీ వంటివి ఉంటాయి. ఇ– ప్రొక్యూర్‌మెంట్‌లో ఎల్‌1 బిడ్డర్‌ కొనుగోళ్లు చేయలేకపోతే ఎల్‌ 2 బిడ్డర్‌కు ఇవ్వాలి. దీనికోసం బిడ్డర్లు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద నిబంధనల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక ఇ–ప్రొక్యూర్‌ మెంట్‌ వేదిక ఉన్నా ఒక్క టెండరును కూడా దీనిద్వారా ఉపయోగించలేదు.

బాక్స్‌ టెండర్లు ఇలా...
సంబంధిత శాఖ కార్యాలయంలో ఓ బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. తూతూ మంత్రంగా ఎక్కడో ఒక పత్రికలో ఎవరూ గుర్తించనంత చిన్న సైజులో ఒక ప్రకటన ఇస్తారు. అమాత్యులు, అధికారులు ఎవరైనా సరే తమకు నచ్చిన బిడ్డరుకు సమాచారం ఇస్తారు. ఫలానా తేదీలోగా బాక్స్‌లో సీల్డ్‌కవర్‌లో టెండరు దాఖలు చేస్తారు. ఈ ధృవపత్రాల గురించి అధికారులకు మాత్రమే తెలుస్తుంది. ధృవపత్రాలను అధికారులే పరిశీలిస్తారు. ఎవరు ఏమిటన్నది మరో బిడ్డరుకు చెప్పరు. తక్కువ రేటుకు కోట్‌ చేసి బిడ్డరు ఎవరైనా అధికారులకు లేదా మంత్రికి నచ్చకపోతే ధృవపత్రాల విషయంలో ఏదో ఒక కొర్రీ వేసి పక్కన పడేస్తారు. తమకు నచ్చిన వారిని తెరమీదకు తెస్తారు. సాంకేతిక బిడ్‌ల నుంచి ఫైనాన్షియల్‌ బిడ్‌ల వరకూ అన్నీ గోప్యంగానే జరుగుతాయి. బాక్స్‌ టెండర్ల ద్వారా చివరి నిముషంలో కూడా బిడ్డరును మార్చిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిసార్లు మిగతా బిడ్డర్లను తర్వాతి టెండరు మీకిస్తాం అంటూ బుజ్జగించడం లేదా భయపెట్టి కూడా తమకు నచ్చిన వారికి టెండర్లు కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తూ జాతీయ ఆరోగ్యమిషన్‌ కూడా ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారానే టెండర్లు నిర్వహించాలని, బాక్స్‌ టెండర్లు నిర్వహించకూడదని ఆదేశించినా రాష్ట్రంలో బాక్స్‌ టెండర్ల ద్వారానే పనులు అప్పజెపుతుండడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement