వర్సిటీ ముందు విద్యార్థుల ధర్నా
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 26న విడుదలైన డిగ్రీ మొదటి, మూడు, ఐదు సెమిస్టర్ ఫలితాలపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్య మూల్యాంకనం, పరీక్షల నిర్వహణే కారణమని మండిపడ్డారు. మొదటి సెమిస్టర్‌లో 22,145 మంది పరీక్ష రాయగా, 7,439 మంది(39.59 శాతం), మూడో సెమిస్టర్‌లో 16,320 మందిగాను 5,660 మంది(34.68శాతం), ఐదవ సెమిస్టర్‌లో 10,112 మందికిగాను 4,625 మంది(45.74 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ వీసీ కార్యాలయం ముందు గురువారం ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని నిరసన తెలిపారు. వీసీ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అదే సమయంలో పరీక్ష నిర్వహణ వాహనం వెళుతుండగా.. దానిని అడ్డుకున్నారు. వీసీ బయటకు రావాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నా వద్దకు వీసీ కూన రామ్‌జీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు చేరుకుని విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.
పరీక్షలకు హాజరైనా కానట్లు చూపుతున్నారు
మొదటి, రెండు సెమిస్టర్లలో పాస్ అయిన వారు ప్రస్తుతం ఫెయిల్ అయ్యారని, తొలి రెండు సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారు పాస్ అయ్యారని విద్యార్థులు వివరించారు. అన్ని పరీక్షలకు హాజరైనా హాజరు కానట్లు కొందరు విద్యార్థులకు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికి ఐదు సెమిస్టర్లు పూర్తయిన విద్యార్థులకు మార్కుల జాబితా హార్డు కాపీలు అందలేదని తెలిపారు. ఫెయిల్ అయినట్లు చూపిస్తున్న విద్యార్థులకు.. తామకు ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం తెలియడం లేదని పేర్కొన్నారు. కెమిస్ట్రీ, గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్, జువాలజీ పరీక్షలు మెరుగ్గా రాసినా ఫెయిల్ అయ్యామని వాపోయారు. మొత్తం జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యార్థులు, అధికారులతో వీసీ చర్చించారు.
అకడమిక్ ఆడిట్ కమిటీ ఏర్పాటు
విద్యార్థుల జవాబు పత్రాల పరిశీలనకు అకడమిక్ ఆడిట్ వేస్తామని వెల్లడించారు. పరీక్ష మెరుగ్గా రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రిన్సిపాళ్లకు జాబితా ఇవ్వాలని సూచించారు. ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో లోపాలు బయటపడితే.. అన్ని పశ్నపత్రాలు మూల్యాంకనం చేస్తామని తెలిపారు. ఇన్‌స్టెంట్, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ ఉన్నత విద్యామండలిపై అ«ధారపడిఉంటుందని, వారి దృష్టికి సమస్య తీసుకువెళతామన్నారు. విద్యార్థుల మార్కుల జాబితాల హార్డ్ కాపీలు పరీక్షలు పూర్తయిన వెంటనే కళాశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. దీంతో విద్యార్థులు శాంతించి వెనుదిరిగారు. విద్యార్థులకు అఖిల భారత విద్యార్థిపరిషత్ జిల్లా సంఘటనా కార్యదర్శి తురకా ప్రసాద్ మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment