విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మూమూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జోగుతున్నారు. ఎక్సైజ్ అధికారుల తీరు దొరికితే దొంగలు లేకపోతే దొరలనే చందంగా ఉందని ప్రజానీకం అంటున్నారు. సోమవారం ఎక్సైజ్ సూపరింటెండెట్ బీ.శ్రీలత, జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ నెల వారీ మూమాళ్లు తీసకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
నాకే పాపం తెలియదు.. ఈఎస్ గారి ఆదేశాలు పాటించా .
తాను సమ్మెలో ఉన్నానని తనకే పాపం తెలియదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ వాపోయారు. తాను సమ్మెలో ఉన్నానని ఈఎస్ పిలిచి మద్యం వ్యాపారి డబ్బు ఇస్తాడు తీసుకో మని చెప్పారని, అంతకు మించి తనకే పాపం తెలియదని ఆయన లబోదిబోమంటున్నాడు. అధికారికి సంబంధం లేకుండా చిన్న ఉద్యోగినైన తనకు అంత డబ్బు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు.
అంతా అబద్ధం...లంచం డిమాండ్ చేయలేదు : ఈఎస్
కాగా ఏసీబీ దాడి అనంతరం మీడియా ప్రతినిధులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలతను విరరణ కోరగా తాను లంచం తీసుకోలేదని, జూనియర్ అసిస్టెంట్ అబద్ధం చెబుతున్నాడని అన్నారు. తన చేతులకు రంగు అంటలేదని చేతులను చూపించారు. తాను డీసీ కార్యాలయంలో మీటింగ్‌లో ఉన్నానని తనను ఏసీబీ అధికారులు ఫోన్ చేసి పక్కనే ఉన్న కార్యాలయానికి రమ్మని పిలిచారని చెప్పారని ఆమె చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకున్నాడని, తమకు దర్యాప్తులో సహకరించమని ఏసీబీ అధికారులు కోరారని అంతకు మించి తనకేమి తెలియదన్నారు. కొద్ది రోజుల క్రితం కృష్ణలంకలో కనకదుర్గా బార్ అండ్ రెస్టారెంట్‌పై తనిఖీ చేసి జరిమానా విధించానని చెప్పారు.
లంచం డిమాండ్ చేశారు: ఏసీబీ డీఎస్ఫీ విజయపాల్
కాగా ఎక్సైజ్ సూపరింటెండెట్ శ్రీలత లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ ఆర్. విజయపాల్ అన్నారు. అమె లంచం డిమాండ్ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆమె డెరైక్టుగా లంచం తీసుకోలేదన్నారు. జూనియర్ అసిస్టెంట్ రూ.40వేలు తీసకున్నాడని, ఆడబ్బును శ్రీలతకు ఇవ్వబోతుండగా తాము వలపన్ని పట్టుకున్నామని చెప్పారు. శనివారం బార్ షాపు యజమాని తమకు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆ ఫిర్యాదుపై తాము విచారణ జరిపి నిందితులిద్దరిని అరెస్టు చేశామని చెప్పారు. నిందితులను మంగళవారం కోర్డులో హాజరు పరుస్తామని అన్నారు.