కారులోనే కాలిపోయారు!
కారులోనే కాలిపోయారు!
Published Tue, Sep 19 2017 2:12 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
తల్లి, ఇద్దరు చిన్నారులు సజీవ దహనం
ఆళ్లగడ్డ: అతివేగంగా వెళ్తున్న కారు దగ్ధమైన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలసి మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఆ కుటుంబానికే చెందిన వ్యక్తి కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన నుంచి అతడు తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
తిరుగు ప్రయాణంలో వదిన, పిల్లలతో కలసి బయల్దేరి..
పోలీసుల కథనం మేరకు అనంతపురం జిల్లాకు రాజాప్రసాద్ ఆదివారం కారు (కేఏ 53 జెడ్ 21047 ఫోర్డ్ ఫిస్టా)లో బాడుగకు ప్రయాణికులను తీసుకుని గుత్తి నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లాడు. అక్కడ వారిని దింపిన తరువాత ప్రొద్దుటూరులోని తన అన్న నాగరాజు ఇంటికి వెళ్లాడు. అనంతరం రాత్రిపూట నాగరాజు భార్య వనితాబాయి (25), పిల్లలు ప్రేమ్‌కుమార్ (5), ఉమేష్ (2) అతడితో కలసి నంద్యాల కారులో బయల్దేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు బత్తలూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ మట్టికుప్పను ఢీకొని సుమారు 20 మీటర్ల దూరం ఎగిరిపడింది. వెంటనే మంటలు వ్యాపించటంతో కారులో వెనుక సీట్లో కూర్చున్న వనితాబాయి, ఆమె కుమారులు ప్రేమ్‌కుమార్, ఉమేష్ కాలి బూడిదయ్యారు. కారు నడుపుతున్న రాజాప్రసాద్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మరి కొద్ది సేపట్లో గమ్యం చేరుకునే సమయంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కాటేసింది.
వనితాబాయి, ఆమె చిన్న కుమారుడు ఉమేష్ మాత్రమే నంద్యాల వెళ్లాలని తొలుత కారులో కూర్చున్నారు. అయితే ఉదయం ఇంటిదగ్గర ఎవరూ ఉండరని, పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్‌ను కూడా వెంట తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు సూచించటంతో అప్పటికే నిద్రిస్తున్న చిన్నారిని అలాగే కారులో పడుకోపెట్టారు. చిన్నారి నిద్ర నుంచి లేవకుండానే శాశ్వత నిద్రలోకి తల్లీబిడ్డ జారుకున్నారని తండ్రి, బంధువులు గుండెలవిసేలా రోదించారు.
Advertisement