కీచక టీచర్
పలమనేరు, న్యూస్‌లైన్: నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కాస్త డబ్బున్న అమాయక టీచర్లను టార్గెట్ చేసి వారి బలహీనతలతో ఆడుకుంటున్నాడు. తన కోర్కెలు తీర్చుకుని రహస్యంగా వాటిని వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ పబ్బంగడుపుకుంటున్నాడు.
ఇతని బారిన పడి ఎందరో మహిళా టీచర్లు బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. సమాజంలో బాగా డబ్బున్న వ్యక్తిగా చలామణి అవుతూ తన విలాసాలు, అక్రమాల కోసం అమాయక టీచర్ల జీవితాలతో చెలగాటమాడుకునే ఈ నయవంచకుడి నిజస్వరూపంపై ధైర్యం చేసి ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతని చరిత్ర ఆదివారం వెలుగు చూసింది. ఉపాధ్యాయ లోకం తలదించుకునే ఈ సంఘటన గంగవరం మండలంలో జరిగింది.
సోమల మండలం సూరయ్యగారిపల్లెకు చెందిన చంద్రమౌళి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గంగవరం మండలంలో పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైంది. ఇతని భార్య సైతం ఉపాధ్యాయురాలే. ఇదిలా ఉండగా ఇదే మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్‌పై ఇతని కన్నుపడింది. సీఆర్సీ సమావేశాలు జరిగినప్పుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
సమస్యల్లో ఉన్న టీచర్లను ఆదుకోవడమే తన లక్ష్యమని నమ్మబలికాడు. తనకు బ్యాంకు మేనేజర్లతో పాటు చిట్‌ఫండ్ కంపెనీల వారితో పరిచయాలున్నాయని, ఎటువంటి రుణాలు కావాలన్నా ఇప్పిస్తానంటూ చెప్పాడు. దీంతో అతన్ని నమ్మిన ఆమె ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల రుణం కావాలని కోరింది. ఆ పని తాను చేస్తానంటూ బాధితురాలి వద్ద తొలుత రూ.2.5లక్షల వరకు చెక్కులను తీసుకున్నాడు. వాటి ఆధారంగా డబ్బు డ్రా చేసుకున్నాడు.
అయితే ఈ విషయం బాధితురాలి భర్తకు తెలిసింది. దీంతో చంద్రమౌళి కారణంగా తమ కుటుంబంలో కలహాలొస్తాయని భావించిన ఆమె తన డబ్బు తనకు చెల్లించాలని పట్టుబట్టింది. దీంతో చిట్‌ఫండ్‌లో లోన్ మంజూరైందని వెంటనే సంతకాలు చేయడానికి తిరుపతి రావాలని బాధితురాలితో నమ్మబలికాడు. ఆమెను తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని అందించాడు.
ఆపై తనకు అవసరమైన విధంగా బాధితురాలిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. కొంతసేపటికి తేరుకున్న బాధితురాలికి ఆ వీడియోలను చూపెట్టి దీన్ని యూటూబ్‌లో పెడతానంటూ బెదిరిం చాడు. అంతేకాకుండా బాధితురాలు చిట్‌ఫండ్ కంపెనీలో రుణం కోసం తెచ్చుకున్న పలు ఖాళీ చెక్కులు, ప్రోనోట్లపై బెదిరించి సంతకాలు చేయించుకున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే విషయం బయటపెడతానంటూ బాధితురాలిని భయపెట్టాడు.
విధిలేని పరిస్థితుల్లో ఆమె జరిగిన విషయాన్ని భర్తకు వివరించింది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగరాదని ధైర్యం చేసి పలమనేరు సీఐ బాలయ్యకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. నయవంచక టీచర్ బారినపడిన బాధితులు ఎందరో ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ బాలయ్య తెలిపారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి : సీఐటీయూ
తిరుపతి సిటీ, న్యూస్‌లైన్ : పలమనేరు ఏరియా ఆస్పత్రిలో సమస్యలపై ధర్నా చేసిన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. సీటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన కౌన్సి ల్ సమావేశంలో ఆయన జిల్లా అధ్యక్షుడు చైతన్యతో కలిసి మాట్లాడా రు. ఈ నెల 3వ తేదీన ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రశ్నించిన సీఐటీయూ నాయకులు ఓబుల్‌రాజు, గిరిధర్‌గుప్తాపై అక్ర మ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.