ఐక్యపోరుకు సిద్ధం కావాలి
వాల్మీకుల సమరభేరి సభలో బూటాసింగ్
కర్నూలు, న్యూస్‌లైన్: వాల్మీకులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి బూటాసింగ్ పిలుపునిచ్చారు. వాల్మీకులు ఎదుర్కొంటున్న వివక్షను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కర్నూలులో ఆదివారం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన వాల్మీకి సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాల్మీకులను ఎస్సీ, ఎస్టీలుగా పరిగణించబడుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీసీలుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా ఉండటం శోచనీయమన్నారు. ఈ వ్యత్యాసాలతో వాల్మీకులు అన్ని రంగాల్లో నష్టపోతున్నారన్నారు. బల్లారి ఎమ్మెల్యే బోయ శ్రీరాములు మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉంటే వాల్మీకులకు న్యాయం జరిగేదన్నారు. అంతకు ముందు నగరంలో వాల్మీకుల భారీ ర్యాలీ నిర్వహించారు.