
'ఎన్టీఆర్ సుజల స్రవంతి' ప్రమాదకరం
బహుళజాతి కంపెనీలకు మార్గం సుగమనం చేసేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు.
కాకినాడ: బహుళజాతి కంపెనీలకు మార్గం సుగమనం చేసేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. భవిష్యత్తులో ఈ పథకం ప్రమాదకరంగా మారబోతోందని హెచ్చరించారు. ఆరోగ్యం, వైద్యం ఏ విధంగా ప్రైవేట్ పరం అయ్యాయో అదే విధంగా తాగునీరు కూడా భవిష్యత్తులో ప్రైవేట్ పరం కాబోతుందని ఆందోళన చెందారు.
శనివారం తూర్పు గోదావరి జిల్లా ముఖ్యకేంద్రమైన కాకినాడ వచ్చిన బీవీ రాఘవులు విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పథకాల పేరుతో ప్రజలను వంచిస్తున్న తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. కరెంట్ కోసం చంద్రబాబు చెప్పేవన్నీ బోగస్ మాటలే అని రాఘవులు ఎద్దేవా చేశారు.
జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలను ఎందుకు భాగస్వామ్యం చేయలేదని చంద్రబాబును ఈ సందర్భంగా రాఘవులు ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్ పేరుతో విజయవాడలోని డ్రైనేజీలను శుభ్రం చేస్తే సరిపోదని... రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లోని మరుగుదొడ్లను ఒక్కసారి పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు రాఘవులు సూచించారు.