20 నాటికి 50 శాతం టెండర్లు పూర్తి
- చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయకు సంబంధించి 50 శాతం చెరువు పనులను ఈ నెల 20 నాటికి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు చిన్ననీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. లక్ష్యం విధించుకున్న చెరువు పనులను వచ్చే వర్షాకాలానికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్న దృష్ట్యా అధికారులు తమ కసరత్తును వేగిరం చేయాలని సూచించారు.
శనివారం హరీశ్‌రావు నీటి పారుదల శాఖ అధికారులు, కలెక్టర్లు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. చెరువుల అంచనాల తయారీ, పరిపాలనా అనుమతులు, టెండర్ల అనుమతులపై చర్చించారు. ఈ ఏడాది పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్న 9,300 చెరువుల్లో ఇప్పటి వరకు 5,322 చెరువుల పనుల సర్వే పూర్తయిందని, 3,051 చెరువుల అంచనాలు సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే 480 చెరువులకు రూ.170 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయన్నారు. వచ్చే శనివారానికి మరిన్ని చెరువులకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, ‘టెండర్లు పిలవనున్న గ్రామాల్లో కళాజాత, గ్రామసభలు నిర్వహించాలని, జనవరి 26 సందర్భంగా విద్యార్థులకు చెరువులపై వ్యాస, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించాం.
ట్రిపుల్‌ఆర్ కింద కేంద్రానికి పంపాల్సిన చెరువుల అంచనాలను త్వరగా పూర్తి చేయాలని, వెయ్యి కోట్లతో కూడిన నాబార్డ్ నిధుల కోసం ప్రతిపాదనలు పూర్తి చేయాలని సూచించాం. ప్రతి శనివారం మిషన్ కాకతీయపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామ’ని చెప్పారు. సమావేశంలో ఇసుక పాలసీపైనా చర్చించామని, త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేస్తామని మంత్రి చెప్పారు.