
తాత్సారానికే రుణమాఫీపై కమిటీ
‘‘రుణమాఫీపై తొలి సంతకం చేశానంటే వెంటనే అమలు ఉత్తర్వులు ఇస్తారనుకున్నాం. కానీ కమిటీ వచ్చింది. చంద్రబాబు కంప్యూటర్ ముందు రెండు నిమిషాలు కూర్చుంటే రైతుల రుణాల డేటా మొత్తం వస్తుంది.
సాక్షి, హైదరాబాద్: ‘‘రుణమాఫీపై తొలి సంతకం చేశానంటే వెంటనే అమలు ఉత్తర్వులు ఇస్తారనుకున్నాం. కానీ కమిటీ వచ్చింది. చంద్రబాబు కంప్యూటర్ ముందు రెండు నిమిషాలు కూర్చుంటే రైతుల రుణాల డేటా మొత్తం వస్తుంది. రుణాల లెక్క తేల్చడానికి కమిటీ ఎందుకు? తాత్సారం చేయడానికి తప్ప దేనికీ ఉపయోగపడదు. ఖరీఫ్ ఇప్పటికే మొదలైంది. రుతుపవనాలు కాస్తంత అలస్యమయ్యాయి. లేదంటే ఇప్పటికే రైతులు రుణాల కోసం అల్లాడిపోదురు. నేడోరేపో వర్షాలు పడతాయి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులను రుణం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాలని సలహా ఇస్తుందా? లేకా ‘క్రాప్ హాలిడే’ ప్రకటిస్తుందా?’’ అని ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం మండలిలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మోసగాడి విషపు నవ్వుకు మోసపోయిన అమాయకపు కన్యలా ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ ఉందని వ్యాఖ్యానించారు. ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని రుణమాఫీ హామీ ఇచ్చారని, ఎప్పటిలోగా ఎలా అమలు చేస్తారో సభకు చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన ప్రభుత్వం.. శిధిలాలని, యుద్ధం తర్వాత జపాన్ అని.. భయాందోళనలు ఎందుకు కలిగిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆడిన మాట మీద నిలబడిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు లేకపోవడంవల్లనే ప్రజల్లో అపనమ్మకమని విమర్శించారు. సీమాంధ్ర ప్రయోజనాల గురించి ఒక్క పదం కూడా లేకుండా లేఖ ఇచ్చిన చంద్రబాబుదే రాష్ట్ర విభజన పాపమని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీల పేరిట ప్రభుత్వం కాలయాపన చేయడం సమంజసమా అని సీపీఐ సభ్యుడు పి.జె.చంద్రశేఖరరావు నిలదీశారు.