
గవర్నర్‌ను రీకాల్ చేయాలి
కాంగ్రెస్ నేత రామచంద్రయ్య డిమాండ్
తిరుపతి సిటీ: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ప్రభుత్వ పాలనకు మద్దతిస్తున్న గవర్నర్ నరసింహన్‌ను వెంటనే రీకాల్ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తూ.. ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.
మూడేళ్లుగా చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజాభిమానమున్న నాయకుడు వైఎస్ జగన్ అని.. అదే ప్రజాభిమానంతో 67 మంది ఎమ్మెల్యేలను ఆయన గెలిపించుకున్నారని పేర్కొన్నారు. ఆయన మీద కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, అలాంటి వ్యక్తిని నేరస్తుడు అని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.