అనైక్యతే చేటు తెచ్చిందా..?
అనైక్యతే చేటు తెచ్చిందా..?
Published Tue, Apr 4 2017 8:12 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
► ప్రకాశంపై చంద్రబాబు శీతకన్ను
► మంత్రి వర్గ విస్తరణలో మొండిచేయి
► శాఖల కేటాయింపులోనూ చిన్నచూపు
► మంత్రి శిద్దా నుంచి కీలక శాఖలు తప్పించిన సీఎం
► అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల కేటాయింపు
► శిద్దా మెతక వైఖరే కొంపముంచిందా..!
► జిల్లాలో ప్రధాన రోడ్ల అభివృద్ధి ప్రశ్నార్థకం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాపై శీతకన్ను వేశారు. తాజా మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందని ఆశించిన వారికి మొండిచేయి చూపారు. విస్తరణ అనంతరం శాఖల కేటాయింపులోనూ జిల్లాకు తీరని అన్యాయం చేశారు. ఇప్పటి వరకూ మంత్రి శిద్దా రాఘవరావుకు కేటాయించిన రోడ్లు–భవనాలు, రవాణాశాఖలను ఆయన నుంచి తప్పించారు. ప్రాధాన్యతలేని అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. జిల్లాకు ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించడంపై సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. సీఎం నిర్ణయం జిల్లా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వర్గపోరుతో రగిలిపోతున్న కొందరు ముఖ్య నేతలు ఎవరికి వారు ప్రత్యర్థులకు అడ్డుకట్ట్ట వేయాలని ప్రయత్నించడం, జిల్లా అభివృద్ధి కోసం కలిసికట్టుగా ఒత్తిడి చేయలేకపోవడం ప్రకాశం జిల్లాపై చంద్రబాబు చిన్నచూపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : మంత్రి శిద్దా రాఘవరావు తనకు కేటాయించిన కీలక శాఖలను సమర్థమంతంగా నడిపించడంలో విఫల మయ్యారన్న విమర్శలున్నాయి. ఆయన తనకు కేటాయించిన శాఖలపై పట్టుసాధించ లేకపోయారని ముఖ్యమంత్రి భావించినట్లు ప్రచారం ఉంది. ఆయా శాఖల పరిధిలోని ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి అధికారులపై సైతం శిద్దా పట్టు కోల్పోయారన్న ప్రచారం జరిగింది. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు విమర్శలొచ్చాయి. స్వతహాగా సౌమ్యుడైన శిద్దా ఎవరితోనూ కఠినంగా వ్యవహరించలేక పోవడమే ఆయనకు నష్టం చేకూర్చిందని తెలుస్తోంది.
ప్రాధాన్యత లేని శాఖతో అబివృద్ధికి విఘాతం..
జిల్లాలోని దొనకొండ, కనిగిరి, కందుకూరు ప్రాంతాలతో పాటు సముద్రతీర ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. మరో వైపు జిల్లా గుండా అమరావతి నుంచి అనంతపురం వరకూ ఎక్స్‌ప్రెస్ వే ప్రధాన రహదారి నిర్మాణం చేయాల్సివుంది. సంబంధిత శాఖ లేకపోతే జిల్లాకు నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆశాఖను శిద్దా నుంచి తప్పించి విశాఖకు చెందిన అయ్యన్న పాత్రుడికి అప్పగించారు. రవాణాశాఖను అచ్చన్నాయుడికి కేటాయించారు. శిద్దాను రోడ్లు, భవనాల శాఖ నుంచి తప్పించడంతో జిల్లాలోని ప్రధాన రోడ్ల నిర్మాణంతో పాటు సాధారణ రోడ్ల అభివృద్ధి సైతం ప్రశ్నార్థకంగా మారింది.
వర్గ విభేదాలే కొంప ముంచాయా..?
ప్రకాశం జిల్లా పట్ల ముఖ్యమంత్రికి చిన్నచూపునకు జిల్లా అధికార పార్టీ నేతలమధ్య వర్గ విభేదాలే కారణంగా తెలుస్తోంది. పచ్చ నేతల మధ్య అనైక్యతను ముఖ్యమంత్రి అవకాశంగా తీసుకొని జిల్లా అభివృద్ధిని గాలికొదిలారు. తాజా మంత్రి వర్గంలోనూ జిల్లాకు మరో పదవి ఇవ్వక పోగా అంతకు ముందున్న ప్రాధాన్యత కలిగిన శాఖలను సైతం తొలగించి అన్యాయం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పాత టీడీపీ నేతల మధ్య ఇప్పటికీ సఖ్యతలేదు. అద్దంకి, గిద్దలూరు, చీరాలలో సమస్య సమసి పోలేదు. జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతల మధ్య విభేదాలు ఇప్పటికే తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు సొంత ప్రయోజనం కోసమో.. ప్రత్యర్థులకు అడ్డకట్ట్ట వేయడానికి ప్రయత్నించడం తప్ప జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. గత మూడేళ్ల పాలనలో పచ్చనేతలు కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిపై ఒత్తడి తెచ్చిన సందర్భం లేదని సొంత పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement