సమైక్య ఉద్యమ స్ఫూర్తి | Candlelight procession to oppose bifurcation | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమ స్ఫూర్తి

Published Thu, Aug 8 2013 3:07 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Candlelight procession to oppose bifurcation

సాక్షి, ఒంగోలు: వాడవాడలా సమైక్య ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగుతోంది. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు ఇలా అందరూ సమైక్యంగా ఉద్యమంలో ముందుకు సాగుతూ కాంగ్రెస్ అధిష్టానం తీరుపై  మండిపడుతున్నారు.
 
 ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం మూడో రోజు రిలే నిరాహార దీక్షల్ని పార్టీ బీసీ సెల్ నేతలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షల్ని ప్రారంభించి ప్రసంగించారు. బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా న్యాయమూర్తి ఎ.రాధాకృష్ణ కారును అడ్డగించి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. న్యాయవాదులకు ఉద్యోగ జేఏసీ మద్దతు పలికింది. బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పది వేల మంది విద్యార్థులతో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్మికులు ఒంగోలు జాతి ఎద్దుకు సమైక్యాంధ్ర నినాదంతో కూడిన బోర్డును తగిలించి వినూత్న రీతిలో నిరసన తెలిపి మానవహారం నిర్వహించారు. ఒంగోలులో పాలిటెక్నిక్ విద్యార్థులు మానవహారం, ర్యాలీ చేపట్టారు.
 
 యర్రగొండపాలెంలో విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, రైతాంగ సంక్షేమ సేవాసంఘం, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు నిరసన ర్యాలీలు  చేపట్టాయి. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరులో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ సెంటర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. చీరాలలో మున్సిపల్ ఉద్యోగులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చీరాల, పేరాల సప్లయర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసింది. భారతీ జూనియర్ కాలేజీ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మలను గడియార స్తంభం సెంటర్‌లో దహనం చేశారు. కందుకూరులో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ర్యాలీ జరిగింది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి ఒకరోజు రిలే దీక్ష చేపట్టగా, మార్కాపురంలో సమైక్యవాది  గంగిరెడ్డి రాజశేఖరరెడ్డి ఆమరణ దీక్షకు దిగారు. దీక్షను వైఎస్సార్ సీపీ విజయవాడ సిటీ ఇన్‌చార్జి ఉడుముల కోటిరెడ్డి ప్రారంభించారు. తాను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగానే దీక్ష నిర్వహిస్తున్నట్లు రాజశేఖరరెడ్డి ప్రకటించారు.  
 
 కనిగిరిలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమంతునిపాడు మండలం వేములపాడులో కూడా ఆటో కార్మికులు ర్యాలీ చేశారు. మార్కాపురం మండలం చింతంగుంట్ల వద్ద రెండువేల మంది విద్యార్థులు, మహిళలతో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం కోర్టు సెంటర్‌లో రాస్తారోకో చేశారు. కొమరోలు మండలంలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం, ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.  చీమకుర్తి మండలం ఎల్లయ్యనగర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బల్లికురవలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. అద్దంకి నియోజకవర్గంలో వాయిద్య కళాకారులు, రంగస్థల కళాకారులు పద్యాలు పాడుతూ సమైక్య రాష్ట్రానికి మద్దతు పలికారు. అనంతరం పాతబస్టాండు సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. పర్చూరులో మూడోరోజు న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు. మర్రిపూడిలో 500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. టంగుటూరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement