- ఎకరాకు 14 నుంచి 22 బస్తాలతో సరి
- భారీగా తగ్గిన దిగుబడులతో రైతుల్లో ఆందోళన
- తగ్గిన మద్దతు ధర
- సాగు ఖర్చులు కూడా రాని వైనం
మచిలీపట్నం : ఖరీఫ్ ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. జిల్లా ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో దిగుబడుల లెక్కింపు కోసం చేపడుతున్న పంట కోత ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడవుతోంది. ముదినేపల్లి మండలంలో మూడు చోట్ల పంటకోత ప్రయోగం చేయగా ఒక ప్రాంతంలో ఎకరానికి 14 బస్తాలు, మరో ప్రాంతంలో 22, వేరొక ప్రాంతంలో 28, గుడ్లవల్లేరులో 28 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చినట్లు ప్రణాళిక శాఖాధికారులు చెబుతున్నారు.
సకాలంలో సాగునీటిని విడుదల చేయకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుతో వరి పొట్టదశ నుంచి సుడిదోమ వ్యాపించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. సుడిదోమ నివారణ కోసం ఆస్టాఫ్, ఎస్పేట్, షైన్, ఓసిన్, ఒలారా తదితర రసాయన మందులు రెండు, మూడు కలిపి పిచికారీ చేసినా ఫలితం కనిపించలేదని అంటున్నారు. ఎకరానికి నాలుగు నుంచి ఐదుసార్లు రసాయనాలు పిచికారీ చేశామని, ఒకసారి రసాయనాల పిచికారీకి రూ.1500 చొప్పున ఖర్చయ్యిందని చెబుతున్నారు.
సుడిదోమ నివారణకే ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.7,500 ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఇది అదనపు ఖర్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎకరా సాగుకు రూ.30 వేలు ఖర్చు చేశామని.. 18 నుంచి 20 బస్తాలు కూడా రాకపోవడంతో ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 5.78 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. జిల్లాలో 12.29 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వరి కోతలు ప్రారంభమై కుప్పనూర్పిళ్ల సమయంలో దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
మద్దతు ధర లేదు
గత ఏడాది 1061, 2067, 2077, 1001, 1010, బీపీటీ 5204 తదితర రకాలను రైతులు సాగు చేశారు. బీపీటీ రకం పాత ధాన్యం ప్రస్తుతం మార్కెట్‌లో బస్తా రూ.1600గా ఉంది. ప్రస్తుతం ఈ రకం ధాన్యం బస్తా రూ.1,050కి ఇచ్చినా కొనుగోలు చేసేవారే కరువయ్యారు. పొలం నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వరకు తీసుకువెళ్లి మద్దతు ధరకు విక్రయిస్తే.. బస్తాకు రవాణా ఖర్చులు పోను రూ.950 మాత్రమేనని మిగులుతాయని రైతులు చెబుతున్నారు.
ఈ లెక్కన ఎకరాకు 20 బస్తాలు చొప్పున దిగుబడి వస్తే రూ.19 వేలు వస్తోందని, సాగు వ్యయం రూ.30 వేల వరకు కాగా, రూ.11 వేలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1061, 2077, 1010, 1001 వంటి రకాలు బస్తా ధాన్యం ధర వెయ్యి రూపాయలుగా ఉందని, దీనిలోనే రవాణా ఖర్చులు తీసేస్తే ఎకరానికి రూ.18 వేలకు మించి రావని పేర్కొంటున్నారు.
గతంలో మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర కన్నా బస్తాకు రూ.100 అదనంగా ధర చెల్లించేవారని, ఈ ఏడాది వారు ఇబ్బడిముబ్బడిగా ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇష్టమున్నా, లేకపోయినా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాళ్వా పైనా స్పష్టత లేదు
ఖరీఫ్ సీజన్‌లో దిగుబడులు తగ్గడంతో రైతులు దాళ్వా సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్‌లో వచ్చిన నష్టాన్ని దాళ్వాలో వరిసాగు చేసుకుని పూడ్చాలనే ఉద్దేశంతో ఉన్నా ప్రభుత్వం సాగునీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకుండా జాప్యం చేస్తోంది. ఓ వైపు వరికోతలు ఊపందుకున్నప్పటికీ ఎలాంటి ప్రకటనలూ చేయకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. సముద్ర తీర మండలాల్లోని భూముల్లో అపరాలు పండే అవకాశం లేనందున దాళ్వాకు సాగునీటిని విడుదల చేస్తే వరిసాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని రైతులు అంటున్నారు.
సుడిదోమ పోటు
Published Wed, Dec 10 2014 2:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement