సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రెండో పెద్ద దేవాలయమైన కనకదుర్గమ్మ దేవస్థానం నిధులు నానాటికీ కరిగిపోతున్నాయి. కొండలా పెరగాల్సిన నిధులు..ప్రవాహంలా కొట్టుకుపోతున్నాయి. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకల్ని అధికారులు పప్పుబెల్లాల్లా ఖర్చు చేయడం.. అందుకు సంబంధించి ప్రభుత్వం ఒక్కపైసా విదల్చకపోవడమే దీనికి కారణమని విమర్శలొస్తున్నాయి.
రూ.215 కోట్ల నుంచి రూ.92 కోట్లకు..
ఐదేళ్ల క్రితం దుర్గమ్మకు రూ.215 కోట్ల డిపాజిట్లు ఉండేవి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ కార్యనిర్వహణాధికారి(ఈవో)గా ఉన్నప్పుడు దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇంద్రకీలాద్రిపై దేవాలయాలు తప్ప మిగిలిన భవనాలను కూల్చివేశారు. లక్షలు విలువ చేసే భవానీమండపం, అడ్మినిస్ట్రేటివ్ భవనం, అన్నప్రసాద భవనం, ప్రసాదాల తయారీ భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు కూల్చిన ప్రదేశంలో గ్రీనరీ పెంచుతామన్నారే తప్ప కార్యరూపం దాల్చలేదు. కాగా అదే సమయంలో అర్జున వీధిలో భూమి సేకరణ ప్రారంభించారు. సుమారు రూ.42 కోట్లు ఖర్చు చేసి భూమి సేకరించారు. అంతేకాకుండా రూ.10 కోట్లు ఖర్చు చేసి సీవీరెడ్డి చారిటీస్ స్థలంలో భక్తులకు తాత్కాలిక కాటేజ్‌లు నిర్మించారు. ఇక రోడ్ల నిర్మాణాలకు, హంగు, ఆర్భాటాలకు నిధులు మంచినీళ్లలా ఖర్చు చేశారు. దీంతో దేవస్థానం నిధులు తరిగిపోయి ప్రస్తుతం రూ.92 కోట్లకు చేరాయని దేవస్థానం అధికారులే చెబుతున్నారు.
వచ్చే ఆదాయమంతా ఖర్చులకే..
దుర్గగుడికి హుండీలు, ఆర్జిత సేవలు, కానుకల ద్వారా ప్రతి నెలా రూ.9 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో రూ.8 కోట్ల వరకు ఖర్చులయిపోతున్నాయి. ఇందులో సిబ్బంది జీతాలు రూ.3 కోట్లు పోగా, మిగిలిన వ్యయం నిర్వహణ ఖర్చులు. పవిత్ర సంగమం వద్ద జరిగే కృష్ణమ్మ హారతులకు ప్రతి నెలా రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. దత్తత దేవాలయల నుంచి ఆదాయం రాకపోయినా.. ప్రతి నెలా వాటి నిర్వహణకు రూ.లక్ష చెల్లిస్తున్నారు. ఇక రాజధానిలో ప్రభుత్వం నిర్వహించే పూజా కార్యక్రమాల వ్యయాన్ని దుర్గమ్మ ఖాతాలోనే వేస్తూ ఉండటంతో వ్యయం నానాటికీ పెరిగిపోతోంది.
కొత్త నిర్మాణాలకు నిధులు నిల్..
భక్తుల కోసం గొల్లపూడిలో ఐదు అంతస్తుల భవనం నిర్మించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అలాగే అన్నదానం భవనం నిర్మించాల్సి ఉంది. అయితే మూలధనం తరిగిపోతూ ఉండటంతో ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టారు. దాతలు సహకరిస్తేనే వీటిని నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల అవసరాలకు కాకుండా ప్రభుత్వ పెద్దల అవసరాల కోసం ఖర్చు చేయడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
దసరా ఉత్సవాలకు రూ.8 కోట్ల వ్యయం..
దసరా ఉత్సవాలకు సుమారు రూ.8 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇందులో సుమారు రూ.5 కోట్లు ఇతరశాఖల సిబ్బంది సేవలు వినియోగించుకున్నందుకు చెల్లిస్తున్నారు. దసరా ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నందున అన్ని శాఖలు ఉచితంగా సేవలు అందించాలి. ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.అయితే ఈ భారమంతా దేవస్థానంపైనే వేస్తున్నారు. గత మూడేళ్లలో రూ.10 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని దేవస్థానం లెక్కలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా విదల్చ లేదు.
Comments
Please login to add a commentAdd a comment