ల్యాండ్ పూలింగ్పై హైకోర్టులో రైతులకు ఊరట
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తున్న రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. తమ అంగీకరాపత్రాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని వేసిన పిటిషన్పై రైతులకు న్యాయస్థానంలో సానుకూల తీర్పు వచ్చింది. కాగా అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు వెల్లడించింది.15 రోజుల్లోగా ఆ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.
అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులపై కోర్టుకు నివేదిక ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఈ విజయం బలవంతపు భూ సమీకరణ వ్యతిరేకిస్తున్న రైతులదని న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలతో అంగీకార పత్రాలను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని ఆయన తెలిపారు.
కాగా ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ల్యాండ్ ఫూలింగ్ నుంచి తమను విముక్తి చేయాలంటూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. క్లాస్ 22 సెక్షన్ 2(52) ఆఫ్ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని.. బలవంతంగా భూములు లాక్కొనే పరిస్థితి సర్కార్ తెచ్చిందని రైతులు తమ పిటిషన్లో పేర్కొన్న విషయం తెలిసిందే.