‘రాజధాని’ కోసం పారదర్శకతతో పరిశీలన | Capital' scrutiny and transparency | Sakshi
Sakshi News home page

‘రాజధాని’ కోసం పారదర్శకతతో పరిశీలన

Published Mon, May 12 2014 12:53 AM | Last Updated on Tue, Aug 14 2018 3:30 PM

‘రాజధాని’ కోసం పారదర్శకతతో పరిశీలన - Sakshi

‘రాజధాని’ కోసం పారదర్శకతతో పరిశీలన

రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై వివిధ ప్రాంతాల్లోని వనరులు, సాంకేతిక అంశాలను పారదర్శకతతో పరిశీలిస్తున్నామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్‌రాయ్ చెప్పారు

ఆగస్టు 31 నాటికి కేంద్రానికి నివేదిక 
అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం 
శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్‌రాయ్

 
 రాజమండ్రి/విజయవాడ:రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై వివిధ ప్రాంతాల్లోని వనరులు, సాంకేతిక అంశాలను పారదర్శకతతో పరిశీలిస్తున్నామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్‌రాయ్ చెప్పారు. పరిశీలనలో ఎటువంటి ప్రాధాన్యాలు ఎంచుకోలేదని, ఎక్కడెక్కడ ఏయే వనరులున్నాయి, రాజధాని నిర్మాణానికిఅవి ఎలా దోహదపడతాయో గుర్తిస్తున్నామని తెలిపారు. రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కృష్ణాజిల్లా విజయవాడలలో పర్యటిం చింది. చైర్మన్ హాజరు కాకపోవడంతో కమిటీ సభ్యుడు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ రతన్‌రాయ్ తాత్కాలిక ఇన్‌చార్జి గా వ్యవహరించారు. విశాఖపట్నం నుంచి ఉదయం 9గంటలకు రాజమండ్రి వచ్చిన కమిటీ సభ్యులు ఓ హోటల్‌లో కలెక్టర్ నీతూప్రసాద్, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులతో గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం రతన్‌రాయ్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కొత్త రాజధాని ఏర్పాటుకు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలతో పాటు సీమాంధ్రలో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అవసరమైతే రాష్ట్రంలో మరిన్నిసార్లు పర్యటించి, రాజధాని ఏర్పాటుకు ప్రాంతాల వారీగా ఉన్న అవకాశాలను ఆగస్టు 31వ తేదీలోగా కేంద్ర హోంశాఖకు నివేదిస్తామని పేర్కొన్నారు. పూర్తిగా సాంకేతికపరమైన అంశాలను గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వడమే తమ పర్యటన సారాంశం అని చెప్పారు. తాము పర్యటించిన జిల్లాలు, నగరాల్లో ఉన్న ప్రసుత్త పరిస్థితులు, అవకాశాలు, వనరుల లభ్యత, ఇతర అంశాలపై కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. తమది కేంద్రానికి సిఫార్సు చేసే కమిటీ కాదని, కేవలం సాంకేతిక వివరాలను మాత్రమే అందించేదన్నారు. అన్ని కోణాల్లో, అన్ని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రాజధాని ఒకేచోట ఏకీకృతంగా ఉంటుందా లేక వికేంద్రీకరణగా ఉంటుందా అనేది తాము నిర్ధారించలేమన్నారు.

కమిటీ మరోసభ్యుడు, న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ కె.టి.రవీంద్రన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలను పరిశీలించి అనుకూలతలు, ప్రతికూలతలను రాజధానికి కావల్సిన అవసరాలతో విశ్లేషిస్తామని తెలిపారు. కమిటీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్‌కు చెందిన అరోమర్ రవి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ డెరైక్టర్ జగన్‌షా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి ఉన్నారు. విశాఖ నుంచి రాజమండ్రి వస్తూ మార్గమధ్యంలో 16వ నంబర్ జాతీయ రహదారికి రాజమండ్రి శివార్లలో ఆనుకుని సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ భూములను కమిటీ సభ్యులు పరిశీలించారు.
 మాస్టర్ ప్లాన్‌పై చర్చ: రాజమండ్రి పర్యటన అనంతరం విజయవాడ వచ్చిన కమిటీ సభ్యులు కలెక్టర్ క్యాంపు కార్యాల యంలో కలెక్టర్ రఘునందన్‌రావు, విజయవాడ నగర పోలీసుకమిషనర్ బి.శ్రీనివాసులు, ఉడా అధికారులతో సమావేశమయ్యారు. వీజీటీఎం ఉడా మాస్టర్ ప్లాన్, కృష్ణా జిల్లా ప్లాన్‌పై చర్చించారు. విజయవాడను రాజధానిగా చేయడానికి అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని రోడ్డు, రైలు, జల, వాయు, రవాణా సౌకర్యాలు సంపూర్ణంగా ఉన్నాయని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు, న్యాయవాదులు పెద్దసంఖ్యలో కమిటీకి వినతిపత్రాలను అందజేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement