యలమంచిలి పట్టణాన్ని ముంపు భయం వెంటాడుతోంది. చి న్నపాటి వర్షానికే పట్టణంలోని పలు వీధులు ముంపు బారిన పడుతున్నాయి.
యలమంచిలి రూరల్, న్యూస్‌లైన్: యలమంచిలి పట్టణాన్ని ముంపు భయం వెంటాడుతోంది. చి న్నపాటి వర్షానికే పట్టణంలోని పలు వీధులు ముంపు బారిన పడుతున్నాయి. పట్టణంలో ఎన్టీఆర్, ధర్మవరం, నాగేంద్రకాలనీ, ఏఎస్‌ఆర్, మిలట్రీ, యానాద్రి కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. గత ఏడాది అక్టోబరు 27న కురిసిన భారీ వర్షాలతో యలమంచిలి పట్టణమంతా ముంపునకు గురయింది. అప్పట్లో పోలవరం ఎడమ కాలువ నీరు శేషుగెడ్డ ద్వారా ప్రవహించడంతో పట్టణ ప్రజలు వారం రోజలపాటు ముంపులోనే గడిపారు. శేషుగెడ్డ గట్టు పటిష్టంగా లేకపోవడంతోపాటు పట్టణంలో పూర్తిస్థాయిలో కాలువలు లేకపోవడంతో యలమంచిలి పట్టణానికి ముంపు సమస్య పరిష్కారం కావడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గత వారం కురిసిన వర్షాలకు పలు వీధులు ముంపు బారిపడ్డాయి.
ఇలా వర్షం పడిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు ప్రారంభమయితే భయంతో గడుపుతున్నారు. వానలు తగ్గుముఖం పట్టిన వారం పది రోజులకు సాధారణ పరిస్థితి నెలకొనడం లేదని వాపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో రోజుల తరబడి తాగునీరు అందడం లేదు. శేషుగెడ్డను పూర్తిస్థాయిలో పటిష్టం చేయడంతోపాటు పట్టణంలో కాలువల నిర్మాణం చేపట్టాలన్న స్థానికుల విన్నపాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యలమంచిలి పట్టణాన్ని ముంపు బారినుంచి తప్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.