ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయకుండా మోసం చేస్తున్నారంటూ కేంద్ర, రాష్ట్ర పెద్దలపై ఛీటింగ్ కేసులు పెట్టారు. ఈ క్రమంలో సోమవారం, మంగళవారం కూడా కేసులు పెట్టాలని పీసీసీ నిర్ణయించింది.
అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్లో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని మాచవరం స్టేషన్లో మోదీ, చంద్రబాబు, వెంయ్యనాయుడుపై పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ఫిర్యాదు చేశారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు.. మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని నెహ్రూ ఈ సందర్భంగా మండిపడ్డారు. తనను కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారని దేవినేని నెహ్రూ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం కాంగ్రెస్ ఇన్‌చార్జి చంద్రకిరణ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం మైలవరం, జి.కొండూరు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదుచేశారు.