ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న తనపై అర్ధరాత్రి సమయంలో దాడి చేసి ఇంటిలోకి చొరబడి బంగారం, నగదును అపహరించారని మంగళవారం చెన్నూరు అరుధంతీయవాడకు చెందిన మేకా పెంచలమ్మ గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు..
గూడూరు టౌన్, న్యూస్‌లైన్ : ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న తనపై అర్ధరాత్రి సమయంలో దాడి చేసి ఇంటిలోకి చొరబడి బంగారం, నగదును అపహరించారని మంగళవారం చెన్నూరు అరుధంతీయవాడకు చెందిన మేకా పెంచలమ్మ గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు..
పెంచలమ్మ తమ్ముడు తూమాటి చిరంజీవి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో సోమవారం రాత్రి కాపలాగా ఇంటి ఆవరణలో నిద్రిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తూమాటి చిన్న, పెంచలయ్య, తులశమ్మ, అంకమ్మ, లక్ష్మమ్మతో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెంచలమ్మ వద్దకు వచ్చి నిద్రలేపి ‘నీ తమ్ముడు చిరంజీవి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని’ కొట్టారన్నారు. భయపడి పారిపోతుండగా వెంటపడి తరిమారన్నారు. ఆ తర్వాత వారంతా ఇంటి తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లి ఇంట్లోని డబ్బులు, నగలు అపహరించుకుని వెళ్లారన్నారు.
వారికి భయపడి రాత్రంతా ఇంటికి దూరంగా ఉండి, ఉదయం వెళ్లి చూడగా ఇంటిలోని వస్తువులంతా చిందరవందరగా పడి ఉన్నాయన్నారు.
దీంతో తన తమ్ముడు చిరంజీవి భార్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో బీరువాలోని 6.50 సవర్ల నగలు, 120 గ్రాముల వెండి, రూ.32 వేలు నగదుతో పాటుగా ఏటీఎం కార్డు, ఎల్‌ఐసీ బాండులు ఉన్నాయో లేవో చూడాలని చెప్పిందన్నారు. ఇంటిలోని వస్తువులతో పాటు బీరువాలోని వస్తువులు ఏమి లేకపోవడంతో గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.