‘ఆధార్’ లేకుంటే కష్టాలే
Published Tue, Dec 31 2013 3:56 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
సాక్షి, నల్లగొండ :నగదు బదిలీ పథకంలో భాగంగా వంట గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ కార్డు ఉండాల్సిందేనని సర్కారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి గృహ అవసర (డొమెస్టిక్) వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. ఈ తేదీలోగా తమ కనెక్షన్, బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసిన వినియోగదారులకు ఇప్పటికే నగదు బదిలీ వర్తిస్తోంది. వాస్తవంగా ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నాటికి ఆధార్ అనుసంధానం లేని వినియోగదారులు రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధరకే కొనాల్సిందేనని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే అన్నివర్గాల ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడం, పూర్తిస్థాయిలో ఆధార్ అందకపోవడం తదితర కారణాలతో గడువును డిసెంబర్ 31కి పొడిగించింది. అయినా ఆశించిన స్థా యిలో అనుసంధానం కాలేదు. దీంతో ప్రభుత్వం గడువును పొడిగించక తప్పలేదు. 2014 జనవరి 31వ తేదీలోగా ఆధార్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాలని సూచించింది. లేకుంటే మరుసటి రోజు నుంచి ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులు సబ్సిడీయేతర (రూ.1120) ధరకే రీఫిల్ సిలిండర్ కొనాల్సిందేనని వెల్లడించింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల యజమానులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్క్యులర్ అందింది. ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని నిక్కచ్చిగా స్పష్టంచేసింది.
పెనుభారం....
జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.23 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 2.80 లక్షల మంది వినియోగదారులు ఆధార్ కార్డు నంబర్లు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు అందజేశారు. ఇందులో 1.80 లక్షల మంది బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇచ్చారు. వీరికి మాత్రమే నగదు బదిలీ పథకం అక్టోబర్ నుంచి వర్తిస్తోంది. మిగిలిన మరో లక్ష మంది బ్యాంకు ఖాతా నంబర్లు అందించాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు 3.43 లక్షల మంది ఇంకా ఆధార్ వివరాలు అందజేయలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే వీరందరకీ ఎప్పుటిలోగా కార్డులు అందుతాయో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో జనవరి 31లోగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయడం అసాధ్యమే. ఇటువంటి వారు రీఫిల్ సిలిండర్ కొనుగోలు చేయాలంటే అదనపు భారం భరించక తప్పదు. వీరికి సబ్సిడీ ధర రూ.418 వర్తించదు. సబ్సిడీయేతర ధర రూ.1120కు కొనుగోలు చేయాల్సిందే. అంటే ఒక్కో రీఫిల్ సిలిండర్‌పై రూ.702 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్దమొత్తంలో భరించడం నిరుపేదలకు తలకు మించిన భారమే అవుతుంది.
నత్తనడకన...
ప్రభుత్వ నిర్లక్ష్యం, ‘ఆధార్’ ఏజెన్సీల నిర్వాకం వల్ల గ్యాస్ వినియోగదారులు ఆధార్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి ఆధార్ కార్డుల వివరాలు నమోదు చేస్తున్నా ఇప్పటివరకు ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు. జిల్లా జనాభా 34.82 లక్షలుంటే, అందులో ఇప్పటివరకు 31లక్షల మంది మాత్రమే ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో ఎంతమందికి కార్డులు అందాయన్న విషయంపై స్పష్టత లేదు. మరో నాలుగు లక్షల పైచిలుకు మంది అసలు ఆధార్ నమోదుకు దూరంగా ఉన్నారు. వీరందరి వివరాలు సేకరించడం, కార్డులు అందజేయడానికి ఎన్ని నెలల సమయం పడుతుందో అధికారులకే తెలియాలి.
Advertisement
Advertisement