సాక్షి, నల్లగొండ: గృహ అవసర వంటగ్యాస్‌కు గత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చింది. ఆధార్ అనుసంధానం లేని వినియోగదారులు రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధరకు కొనాల్సిందేనని ప్రభుత్వం నిక్కచ్చిగా పేర్కొంది. అయితే అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తంకావడం, పూర్తిస్థాయిలో ఆధార్ అందకపోవడం తదితర కారణాల వల్ల గడువును డిసెంబర్ 31వ తేదీకి పొడిగించింది.
అయినా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో గడువును మరోసారి పొడిగించక తప్పలేదు. 2014 జనవరి 31వ తేదీలోగా ఆధార్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులు సబ్సిడీయేతర ధర రూ.1333కే రీఫిల్ సిలిండర్ కొనాల్సిందేనని తెగేసి చెప్పింది.
వారికే వర్తింపు.....
గ్యాస్ ఏజెన్సీతోపాటు బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానమైన వినియోగదారులకు నగదు బదిలీ పథకం (డీబీసీ) వర్తిస్తుంది. అంటే వారు వాస్తవ ధరకే రీఫిల్ కొనుగోలు చేయాలి. ఒక్కో రీఫిల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1333. ఈ మొత్తాన్ని సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఏజెన్సీకి చెల్లిస్తే ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ రూ.843.50 ఆ వినియోగదారుడి ఖాతాలో జమవుతుంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ సీడింగ్ కాకుండా మిగిలిన 4,40,619 మంది వినియోగదారులు నేరుగా సబ్సిడీ ధర రూ.446కే రెండు నెలలపాటు కొనుగోలు చేయవచ్చు. గడువు ముగిసన తర్వాత వీరికి నగదు బదిలీ పథకం వర్తిస్తుంది.
రెండునెలల పాటు
తప్పనున్న భారం
జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 6.23 లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 1.82 లక్షల మంది వినియోగదారుల మాత్రమే తమ బ్యాంకు ఖాతాకు, వంటగ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ సీడింగ్ చేయించుకున్నారు. వీరు ఫిబ్రవరి నుంచి మొదటగా రీఫిల్ సిలిండర్‌ను వాస్తవ ధర రూ.1333కు కొనుగోలు చేయాల్సి వచ్చేది. సిలిండర్ ధర పోను ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ వారి బ్యాంక్ ఖాతాలో జమయ్యేది.
మరో 3.14 లక్షల మంది వినియోగదారులు తమ ఆధార్ కార్డు నంబర్లు కేవలం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకే అందాయి. వీరి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాలేదు. వీరితోపాటు ఇప్పటికీ గ్యాస్ ఏజెన్సీలకు అసలు ఆధార్ నంబర్లు ఇవ్వని 1.26 లక్షల మంది సబ్సిడీయేతర ధరకే రీఫిల్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రెండు నెలలపాటు ఈ భారం వినియోగదారులకు తప్పనుంది.
కొంత మేర ప్రయోజనం..
జిల్లాలో ఆరు లక్షలకు పైగా వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఏడాదిలో ఆరుకు పైగా సిలిండర్లు వాడే కుటుంబాలు 2 లక్షల వరకు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. 9 సిలిండర్లకు పైగా వినియోగించే కుటుంబాలు మరో లక్ష వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటప్పుడు గరిష్టంగా 12 సిలిండర్లకు పెంపు నిర్ణయం వీరికి కొంత మేర ప్రయోజనం కలిగించినట్టే.
గ్యాస్ ఊరట
Published Fri, Jan 31 2014 4:13 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement