మరో 3 చార్జిషీట్లు | CBI Files three Charge Sheets YS Jaganmohan Reddy assets case | Sakshi
Sakshi News home page

మరో 3 చార్జిషీట్లు

Published Wed, Sep 11 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

మరో 3 చార్జిషీట్లు

మరో 3 చార్జిషీట్లు

* జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో పెన్నా, ఇండియా, భారతి సిమెంట్లపై వేర్వేరుగా దాఖలు చేసిన సీబీఐ
* సీల్డ్‌కవర్‌లో  కోర్టుకు సమర్పించిన డీఐజీ వెంకటేష్
* నిందితులుగా ఐఏఎస్‌లు శామ్యూల్, ఆదిత్యనాథ్ దాస్ మరికొందరు
* పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ తదితరులు కూడా
* మూడు రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేస్తామన్న సీబీఐ
* దర్యాప్తుపై సోమవారంతో ముగిసిన సుప్రీంకోర్టు గడువు
 
సాక్షి, హైదరాబాద్:  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ మరో మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ డీఐజీ, ఈ కేసు ప్రధాన దర్యాప్తు అధికారి హెచ్.వెంకటేష్ మంగళవారం మూడు చార్జిషీట్లను సీల్డ్ కవర్‌లో సీబీఐ రెండో అదనపు ప్రత్యేక జడ్జి ఎం.వి.రమేష్‌కు అందజేశారు. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు అనారోగ్యంతో రెండురోజులు సెలవులో ఉండడంతో... ఇన్‌చార్జిగా ఉన్న రెండో కోర్టు న్యాయమూర్తికి ఈ చార్జిషీట్లు సమర్పించారు. జగన్ సంస్థల్లో పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టాయి. వీటికి సంబంధించి రెండు చార్జిషీట్లు వేయటంతో పాటు జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లోకి వచ్చిన పెట్టుబడులపై మరో చార్జిషీటు వేశారు.

ఈ చార్జిషీట్లకు అనుబంధంగా ఉండే డాక్యుమెంట్లు, సాక్షుల వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి వచ్చిన తర్వాత సమర్పిస్తామని నివేదించారు. అలాగే రెండు మూడురోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు చేస్తామని వెంకటేష్ కోర్టుకు తెలిపారు. ఈ చార్జిషీట్లలోని నిందితులపై ప్రధానంగా ఐపీసీ 120(బి), రెడ్‌విత్ 420, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(డి), 13(2)లను చేర్చినట్లు తెలుస్తోంది. చార్జిషీట్ల దాఖలు సందర్భంగా కోర్టు హాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.

నిందితుల వివరాలు తెలపండి...
‘‘గతంలో విచారణ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి నాలుగు నెలలు గడువిచ్చింది. ఆ గడువు ఈ నెల 9తో ముగిసింది. గడువు తరవాత జగన్‌మోహన్‌రెడ్డి తరఫున మేం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా సుప్రీం చెప్పింది. సుప్రీం తీర్పు ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తాం. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల వివరాలు మాకు తెలిస్తే తప్ప బెయిల్ పిటిషన్‌లో ఆ విషయాలను పేర్కొనలేం. అందుకే చార్జిషీట్లలో నిందితుల వివరాలను మాకు తెలియజేయండి. చార్జిషీట్ చూసుకునేందుకు ఐదు నిమిషాలు అనుమతించండి’’ అని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి... మూడు చార్జిషీట్లలో ఉన్న నిందితుల వివరాలను తెలపాలని డీఐజీకి సూచించారు. దీంతో ఆయన నిందితుల వివరాలను అశోక్‌రెడ్డికి తెలియజేశారు. గతంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.... నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని ఈ ఏడాది మే నెల మొదటి వారంలో సీబీఐని ఆదేశించింది. ఆ గడువు సోమవారంతో ముగిసింది. సోమవారం సెలవు కావటంతో మంగళవారం సీబీఐ ఈ చార్జిషీట్లు దాఖలు చేసింది.
 
ప్రజలు ఇది గమనించాలి: సీబీఐ
చార్జిషీట్లలోని వివరాలు తెలియజేసిన సీబీఐ... తన ప్రకటనలో చివర ఒక అంశాన్ని పొందుపరిచింది. ఈ వివరాలన్నిటికీ తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలే ఆధారమని ప్రజలు గమనించాలని స్పష్టం చేసింది. ‘‘భారతీయ చట్టాల ప్రకారం తుది విచారణలో వారు నేరం చేశారో లేదో తేలేదాకా నిందితులు ఏ నేరమూ చేయలేదనే భావించాలి. ఇది ప్రజలు గమనించాలి’’ అని పేర్కొంది.
 
చార్జిషీట్లలో ఏం పేర్కొన్నారంటే...
మూడు చార్జిషీట్లలో ఏమేం పేర్కొన్నదీ సంక్షిప్తంగా తెలియజేస్తూ సీబీఐ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్లో కంపెనీల పేర్లు గానీ, వ్యక్తుల పేర్లు గానీ పేర్కొనకుండా... వారి హోదాలు మాత్రమే పేర్కొన్నారు. కానీ జడ్జి సూచన మేరకు న్యాయవాది అశోక్‌రెడ్డికి నిందితుల పేర్లు తెలపటంతో వివరాలు వెల్లడయ్యాయి. వాటి ప్రకారం...
 
ఇండియా సిమెంట్స్
ఆరోపణ: చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్‌కు నియమ నిబంధనలకు విరుద్ధంగా లీజు రెన్యువల్ చేయటం... కాగ్నా, కృష్ణా నదుల నుంచి నీటిని కేటాయించటం వంటి ప్రయోజనాలు కల్పించారు. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ ఎండీ దాదాపు రూ.140 కోట్లను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన మూడు కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు.
 
 నిందితులు: 1. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. ఎన్.శ్రీనివాసన్ (చైర్మన్, ఇండియా సిమెంట్స్), 4. శామ్యూల్ (సీనియర్ ఐఏఎస్ అధికారి), 5. ఆదిత్యనాథ్ దాస్ (సీనియర్ ఐఏఎస్ అధికారి), 6. రఘురామ్ సిమెంట్స్, 7. ఇండియా సిమెంట్స్ 8. జగతి పబ్లికేషన్స్, 9. కార్మెల్ ఏషియా.
 
పెన్నా సిమెంట్స్
ఆరోపణ: హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్స్‌కు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అదికాక కర్నూలు జిల్లాలో 304 ఎకరాల్లో గనులకు ప్రాస్పెక్టివ్ లెసైన్స్ మంజూరు చేశారు. ఇంకా రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల మైనింగ్ లీజును రెన్యువల్ చేశారు. బంజారాహిల్స్‌లో పెన్నా సిమెంట్స్ యజమాని నిర్మించిన హోటల్ కోసం నిబంధనలు సడలించారు. ఈ ప్రయోజనాలు పొందినందుకు ప్రతిగా ఆయన జగన్ కంపెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడి పెట్టారు.
 
నిందితులు: 1. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. ప్రతాప్‌రెడ్డి (పెన్నా గ్రూప్స్ చైర్మన్), 4. పీఆర్ ఎనర్జీస్, 5. జగతి పబ్లికేషన్స్, 6. కార్మెల్ ఏషియా, 7. పెన్నా సిమెంట్స్, 8. పయనీర్ హోల్డింగ్స్
 
భారతి సిమెంట్స్
ఆరోపణ: కడప జిల్లాలో రఘురామ్ సిమెంట్స్‌కు (భారతి సిమెంట్స్‌గా పేరు మారింది)  2,037 ఎకరాల సున్నపురాయి గనులను ప్రభుత్వం లీజుకిచ్చింది. ఇలా లీజుకివ్వటంలో పలు అవకతవకలకు పాల్పడ్డారు. (ఈ ఆరోపణలకు సంబంధించిన పలు అంశాలు ఈ చార్జిషీట్లో చోటు చేసుకున్నాయి)
 
నిందితులు: 1. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, 2. వి.విజయసాయిరెడ్డి, 3. రఘురామ్ సిమెంట్స్, 4. జె.జగన్‌మోహన్‌రెడ్డి (డెరైక్టర్, రఘురామ్ సిమెంట్స్), 5. వీడీ రాజగోపాల్ (గనుల శాఖ మాజీ డెరైక్టర్), 6. వీఎన్ ప్రభు, 7. బి.కృపానందం, 8. శంకర్‌నారాయణ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement