రాజధాని భూ దందాపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
ఏలేశ్వరం: రాజధాని భూ దందాపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం శ నివారం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో పార్టీపతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఏలేశ్వరంలోని బాలాజీచౌక్ వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వరుపుల పార్టీపతాకాన్ని ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల భూములతోపాటు అసైన్డ్ భూములను మంత్రులు, టీడీపీ నేతలు అక్రమంగా కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. నిరుద్యోగభృతిపై అసెంబ్లీలో మంత్రి మాటమార్చడం సిగ్గుచేటన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీనేతలు శిడగం వెంకటేశ్వరరావు, అలమండ చలమయ్య, సామంతుల వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, పసల సూరిబాబు, మలకల వేణు తదితరులు పాల్గొన్నారు.
పెద్దనాపల్లిలో...
వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో పెద్దనాపల్లి గ్రామంలో పార్టీ అవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీపతాకాన్ని ఎగురవేశారు. ఎంపీపీ అయిల సత్యవతి, ఎంపీటీసీ సభ్యుడు బీశెట్టి వెంకటరమణ, జి. గంగాధర్, ఎం. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.