హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌లో సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. సినిమా నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఐపీ పెట్టిన నలుగురు నిర్మాతలకు సంబంధించి రికార్డులను సీబీఐ డీఎస్పీతోపాటు మరో ముగ్గురు అధికారులు తనిఖీ చేశారు.
ఐపీ పెట్టిన నలుగురు నిర్మాతల రికార్డుల తనిఖీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌లో సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. సినిమా నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఐపీ పెట్టిన నలుగురు నిర్మాతలకు సంబంధించి రికార్డులను సీబీఐ డీఎస్పీతోపాటు మరో ముగ్గురు అధికారులు తనిఖీ చేశారు. ఆడిటర్, నిర్మాత భాస్కర్‌రెడ్డి, ‘మేడిన్ వైజాగ్’ నిర్మాత ఉదయ్‌కుమార్, ‘సిక్స్‌టీన్స్’ సినిమా నిర్మాత కృష్ణ తదితరులు సికింద్రాబాద్‌లోని ఐఓబీ నుంచి రూ.20 కోట్లు రుణంగా తీసుకుని ఐపీ పెట్టారు.
ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సీబీఐని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. సదరు నిర్మాతల సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు రికార్డులను సేకరించి విచారణ చేపట్టింది. వీరికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ష్యూరిటీలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. వారిని కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఫిలిం చాంబర్‌లో సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు బయటకు పొక్కడంతో పలువురు నిర్మాతలు భయాందోళనకు గురయ్యారు.