
పేదల చెంతకు ప్రభుత్వ పథకాలు
పాత గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానని జిల్లా సంయుక్త కలెక్టర్ చెరువూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు..
పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఈ దృష్ట్యా ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలను త్వరితగతిన ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తానని జేసీ హామీ ఇచ్చారు.
జిల్లాలో ఆధార్ నమోదు కాని వారు దాదాపు రెండు లక్షల మంది ఉన్నట్లు తెలిసిందని, వారందరికి ఆధార్ నమోదు చేయించి కార్డు అందేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ఆధార్‌తో అను సంధానమైనందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆధార్ ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.
భూ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డులను చేరువ చేయడం ద్వారా ఈ-గవర్నెన్స్ అమలుకు కృషి చేస్తానన్నారు.
గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువయ్యేలా చూస్తానన్నారు. అనంతరం నూతన సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ కార్యాలయం తరపున ఏవో బి.బి.ఎస్. ప్రసాద్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.