
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాక్!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. హుదూద్ నష్టం చంద్రబాబు సర్కార్ చెప్పినంతగా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నష్టం సుమారు రూ.680 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని పేర్కొంది. తాము ఈ విషయంలో ఇంతకన్నా ఎలాంటి సాయం చేయలేమని స్పష్టం చేసింది. ఈ విషయమై మాట్లాడేందుకు ఈ నెల 15న ఢిల్లీ రావాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కబురు పంపింది.
హుద్ హుద్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 21,908 కోట్లు ఆర్ధిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. విశాఖలో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటివరకూ రూ.400 కోట్లు విడుదల చేశారు.
కాగా హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటిస్తారు... కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో సాయం అందుతుందని ఆశలు పెట్టుకున్న చంద్రబాబు సర్కార్కు ఇది ఊహించని దెబ్బే.