‘వర్క్‌ ఫ్రం హోమ్‌’తో జాగ్రత్త | Central Home Ministry Instructions about Work from home | Sakshi
Sakshi News home page

‘వర్క్‌ ఫ్రం హోమ్‌’తో జాగ్రత్త

Published Sat, Apr 18 2020 4:16 AM | Last Updated on Sat, Apr 18 2020 4:57 AM

Central Home Ministry Instructions about Work from home - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ దెబ్బకు సాఫ్ట్‌వేర్‌ సంస్థలతోపాటు పలు కార్పొరేట్, ఇతర సంస్థలు వర్క్‌ ఫ్రం హోమ్‌(ఇంటి నుంచే విధులు) బాట పట్టాయి. ఈ విధానం సైబర్‌ సెక్యూరిటీకి పెను సవాలుగా మారిందని కేంద్ర హోం శాఖ గుర్తించింది. కరోనా మాటున ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్‌ సమస్య పొంచి ఉందని అంతర్జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజన్సీలు సైతం హెచ్చరించాయి. కోవిడ్‌–19ను అడ్డుపెట్టుకుని భారత దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కొన్ని తేదీల్లో సైబర్‌ దాడులు పెరిగినట్టు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంలో సైబర్‌ క్రైమ్‌ అడ్డుకట్టకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది.

► ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటి నుంచే పని చేసే వారు తమ ఆన్‌లైన్‌ అకౌంట్స్‌కు డిఫాల్ట్‌ పాస్‌వర్డ్‌ బదులుగా స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. అదే విధంగా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లను పటిష్టమైన యాంటీ వైరస్‌తోనూ, అప్లికేషన్స్‌ను నిరంతరం అప్‌డేట్‌ చేసుకోవాలి.

► సంస్థలకు సంబంధించిన మీటింగ్స్, వర్క్‌కు సంబంధించిన లింక్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదు.

► వీడియో కాన్ఫరెన్సుల కోసం నమ్మకమైన వెబ్‌సైట్‌ను వినియోగించాలి. కొత్త కొత్త ఆప్షన్లతో వచ్చే తెలియని వెబ్‌సైట్‌లలోని వాటిని వీడియో కాన్ఫరెన్సు కోసం వాడుకుంటే ఆయా సమాచారం లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది.

► ఉచిత వైఫై, ఓపెన్‌గా వైఫై నెట్‌వర్క్‌లను ఎట్టి పరిస్థితుల్లోను వినియోగించకూడదు. ఇంటిలోని వైఫై నెట్‌వర్క్‌లనే వాడుకోవాలి. అలాగే వైఫై పాస్‌వర్డ్‌లను కూడా మార్చుకోవాలి.

► అపరిచిత సంస్థలు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో వచ్చే మెయిల్స్‌ను, లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోను ఓపెన్‌ చేయకూడదు. కొన్ని మెయిల్స్, లింక్స్‌ చాలా నమ్మకం కలిగించేలా ఉంటాయి. వాటిని కూడా ఒకట్రెండు సార్లు పరిశీలించి అవసరమైతేనే ఓపెన్‌ చేయాలి. 

► వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సిస్టమ్స్‌లో రిమోట్‌ యాక్సెస్‌ను డిజేబుల్‌ చేసి వాడుకోవాలి. అవసరమైన సెక్యూరిటీ సాంకేతిక పరిజ్ఞానంతో సిస్టమ్స్‌ను వినియోగించుకోవాలి. 

► సొంత డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు అంత సెక్యూర్‌ కావు. కాబట్టి సాధ్యమైనంత వరకు కంపెనీ ఇచ్చిన డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లను వాడితే మంచిది. అత్యవసరంగా సొంత సిస్టమ్స్‌ను ఆఫీస్‌ పనుల కోసం వాడుకోవాల్సి వస్తే అన్ని రకాల భద్రత కలిగిన సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement