
సాక్షి, గుంటూరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల్లోనే కొత్త చరిత్రను సృష్టించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. ప్రధాని మోదీ వంద రోజుల పరిపాలన అద్భుతంగా కొనసాగిందని, ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు అంగీకరించారని పేర్కొన్నారు. సోమవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశ రక్షణ, పరిపాలన, ఆర్థిక రంగాల్లో సంస్కరణల వేగాన్ని పెంచారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను అదనంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి పెంచారన్నారు. 2024 - 25 నాటికి 344 లక్షల కోట్ల డాలర్లతో బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మోదీ సంకల్పించారని తెలిపారు. పార్లమెంటులో రికార్డు స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయని, రాజ్యసభలో బలం లేకపోయినా ప్రతిపక్షాలను ఒప్పించి 32 బిల్లులను ఆమోదింప చేయగలిగామని అన్నారు.
ఇది మోదీ నాయకత్వంపై ప్రతిపక్షాలకు కూడా ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైందన్నారు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు పతనమవుతూ ఉన్నా భారత దేశంలో మాత్రం చిన్నపాటి ఒడిదొడుకులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ ఎగుమతుల రంగంలో ఎనలేని వృద్ధిని సాధిస్తున్నామన్నారు. రోజుకు 30 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, రైతులకు గిట్టుబాటు ధర, జలశక్తి అభియాన్ ద్వారా వాన నీటి సద్వినియోగం లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment