
విభజనపై కేంద్రం ముందుకెళితే రాజీనామాలే
హైదరాబాద్ : విభజనపై కేంద్రం ముందుకెళితే రాజీనామాలకు వెనకాడేది లేదని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఏడుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలను ఆమోదించుకుంటామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. కొందరు కేంద్రమంత్రులు రాజీ నామాలకు సుముఖంగానే ఉన్నారని లగడపాటి వెల్లడించారు. సమైక్యవాదులు తమని రాజీనామా చేయమనడంలో అర్ధముందన్నారు.
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు రాజీ నామా చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందేమీ ఉండదని లగడపాటి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీ నామా చేస్తే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడించడం కష్టం అవుతుందన్నారు. తెలంగాణపై నోట్ సిద్ధమైతే ఏం చేయ్యాలన్నదానిపైనే సమావేశమం అవుతున్నట్లు తెలిపారు.
ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని రాష్ట్ర విభజనపై కేంద్రం అడుగు ముందుకు వేస్తే కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేస్తారన్నారు. తమ అంతిమ లక్ష్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమేనని లగడపాటి స్పష్టం చేశారు.
కాగా తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తుండడంతో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ భేటీ కానున్నారు. ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ సమావేశం నిర్వహించాలని భావించినా ఎంపీలు, కేంద్రమంత్రులకే పరిమితమైంది. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు తదితర అంశాలపై భేటీలో చర్చ జరగనుంది.