జెండా మోసిన కార్యకర్తలే చివరికి కూరలో కరివేపాకులవుతున్నారు. ఎన్నికల్లో ‘మీరు లేనిదే మేం లేమంటూ’ అభిమానం ఒలకబోసిన నేతలు పదవుల పందేరం వచ్చేసరికి సొమ్ములున్న వారికే సై అంటున్నారు. దీన్నో పెట్టుబడిలేని వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఎక్కువ ముట్టజెప్పిన వారికే పట్టం కడుతున్నారు. ఇలాగైతే పార్టీ కోసం పనిచేసే ద్వితీయ శ్రేణి మాటేమిటని తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.
⇒ ఏఎంసీ పీఠాలకు రేటు కడుతున్న టీడీపీ నేతలు
⇒రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆఫర్లు
⇒ఎక్కువ ఇచ్చిన వారికే దక్కనున్న అందలాలు
⇒కోనసీమలో మరింత ‘ప్రియమైన’ పదవులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పలు దేవస్థానాల చైర్మన్ గిరీల కోసం జిల్లాలో తెలుగుతమ్ముళ్లు క్యూలో ఉండడాన్ని అవకాశంగా తీసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు పందేరంతో పదిరాళ్లు వెనకేసుకుంటున్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని నమ్మిన తమ్ముళ్లు తీరా సీన్ రివర్స్ అవడంతో విస్తుపోతున్నారు.
పదవుల భర్తీ కసరత్తు కొలిక్కి వస్తున్న దశలో కొన్ని చోట్ల చైర్మన్‌గిరీలకు భారీ గిరాకీ ఏర్పడి ఆ పదవి రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకూ పలుకుతోంది. పైసలుంటేనే పదవి అనే ధోరణితో ఉన్న కొందరు నేతల తీరుపై ఆశావహులు అసంతృప్తి బావుటా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గిరీ మొదలు పలు మార్కెట్ కమిటీ చైర్మన్ గిరీల కోసం ఆశావహులు క్యూకట్టారు. ఒకో పోస్టుకు నలుగురైదుగురు రేసులో ఉండటాన్ని అవకాశంగా చేసుకుని కొందరు నేతలు మార్కెట్‌లో సరుకుల చైర్మన్ పదవులను బేరం పెట్టేశారు. ప్రధానంగా కోనసీమలో ఈ పరిస్థితి శృతి మించిందని టీడీపీ వర్గాలంటున్నాయి. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కాకినాడ రూరల్, రాజమండ్రి తదితర నియోజకవర్గాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గిరీలకు డిమాండ్ లక్షల్లో పలుకుతోంది.
ప్రధానంగా అంబాజీపేట, నగరం, రాజోలు, సంపర ఎంసీ చైర్మన్ గిరీలు దక్కాలంటే ఆయా నియోజకవర్గాల నేతలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఇలా లేదంటున్నారు. అంబాజీపేట కమిటీకి పోటీ పడుతున్న నలుగురిలో రూ.10 లక్షలుంటే కాని పని అయ్యేలా కనిపించడం లేదంటున్నారు.
ఆర్థికంగా బలమైన రెండు సామాజికవర్గాల నేతలు పోటీ పడుతున్నందును డిమాండ్ ఎక్కువగా ఉంది. అవసరమైతే రూ.20 లక్షలకైనా వెనుకాడేది లేదని ఒక నాయకుడు ముందుకు వచ్చారని పార్టీవర్గాలంటున్నాయి. ఈ నియోజకవర్గంలోని నగరం కమిటీలో కూడా ఇదేరకంగా ఓ నేత బేరం కుదుర్చుకున్నా.. ఒక మహిళతో అనుచిత ప్రవర్తనకు సంబంధించి పోలీసు కేసు నమోదవడంతో సందిగ్ధత నెలకొంది. దీంతో ఆ స్థాయిలో సొమ్ము ఇచ్చే వారి కోసం ముఖ్యనేత వేట మొదలైందంటున్నారు.
అప్పు రద్దు.. పదవి ముద్దు
కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీపై లెక్క కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికల సందర్భంగా పెట్టిన అప్పు తిరిగి ముఖ్యనేత చెల్లించనవసరం లేదన్టి ఒప్పందం కుదిరిందని సమాచారం. ఇందుకోసం బాలాత్రిపుర సుందరి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆఫర్‌ను కూడా ఆ నాయకుడు కాదనుకున్నాడు. ఏఎంసీ చైర్మన్ ఆశించిన పట్టణ పార్టీ నాయకుడికి శాప్ డెరైక్టర్‌తో సరిపెడుతున్నారని తెలియవచ్చింది.
రాజమండ్రి కమిటీ చైర్మన్‌గిరీకి రూరల్ మండల నేత రూ.10 లక్షల ఆఫర్ ఇచ్చారని సమాచారం. అతనికి బెంగళూరుకు చెందిన ఒక ఆర్థికవేత్త అండదండలు దండిగా ఉన్నప్పటికీ సొమ్ము సమర్పించుకోక తప్పని పరిస్థితి. అప్పనపల్లి దేవస్థానం చైర్మన్ గిరీ సంప్రదాయంగా శెట్టిబలిజ సామాజికవర్గానికే లభిస్తోంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే నాయకులను స్థానికేతరులనే సాకుతో పక్కనబెట్టేస్తున్నారు.
పార్టీలో పెద్దగా కనిపించకపోయినా ఆర్థికంగా స్థితిమంతుడైన రియల్టర్‌కు రూ.10లక్షలకు చైర్మన్ గిరీని ఖాయం చేశారంటున్నారు. ఆరేడు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్లా చైర్మన్ గిరీలు లక్షలు పలుకుతున్నాయి. పదవుల పందేరం కసరత్తు తుది దశకు చేరుకోవడంతో కమిటీలకు ఒకే ఒక్క పేరుతో జాబితాలు పంపించారు. త్వరలో వాటికి ఆమోదం లభిస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
‘మార్కెట్’లో చైర్మన్‌గిరీలు
Published Sat, Jan 3 2015 2:37 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement
Advertisement