మీ ఇంట్లో అవినీతి మాటేమిటి? | Chandra babu lashes out at Rahul Gandi | Sakshi
Sakshi News home page

మీ ఇంట్లో అవినీతి మాటేమిటి?

Published Sun, Dec 29 2013 3:04 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

చరిత్రలో ఏనాడూ లేనన్ని కుంభకోణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ప్రజలను మోసం చేసే ప్రయత్నాల్లో ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు.

రాహుల్‌గాంధీపై చంద్రబాబు ఫైర్


 సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఏనాడూ లేనన్ని కుంభకోణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ప్రజలను మోసం చేసే ప్రయత్నాల్లో ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. అవినీతిని రూపుమాపుతామంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు అందులే భాగమేనన్నారు. యూపీఏ పాలనలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినపుడు రాహుల్‌గాంధీకి అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. శనివారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘2జీ, కామన్వెల్త్, ఐపీఎల్, ఆదర్శ్, అగస్టా, కోల్‌గేట్ వంటి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసిన కుంభకోణాలు యూపీఏ రెండు విడతల పాలనలో జరిగాయి. అవి బయటపడినప్పుడు ఎక్కడున్నావు రాహుల్? ఈ కుంభకోణాలన్నీ ఒక ఎత్తయితే మీ ఇంట్లో జరిగే కుంభకోణాలు మరోఎత్తు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మీ బావ రాబర్ట్‌వాద్రా ఆస్తులు రూ. 5 లక్షలు. ప్రస్తుతం ఆయన  ఆస్తుల విలువ రూ. 20 వేల కోట్లకు చేరింది. మీ బావ అవినీతి నీకు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు.
  ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తనిస్తున్నాం. అనుమతించి ఉంటే ఈ ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానాలు కోరేది.

  తొమ్మిదేళ్ల పాలనలో మీపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్క దానిపైనా మీరు ఎందుకు విచారణకు సిద్ధపడలేదు?  మీ పాలనలో అవినీతిపై ‘బాబు జమానా అవినీతి ఖజానా’ అని సీపీఎం పుస్తకాన్నే ప్రచురించింది. వాటిపై ఈరోజుకూ మీరు సమాధానం చెప్పకుండా నీతి గురించి మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారా?  కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడుతున్న మీరు రాజ్యసభలో ఎఫ్‌డీఐల బిల్లు ఆమోదం పొందడానికి మీ ఎంపీలను ఎందుకు గైర్హాజరయ్యేలా చూశారు?   రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మాత్రం తటస్థ వైఖరిని అనుసరించి తద్వారా ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడినట్టు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement