
సాక్షి, అమరావతి : అధికారంలో ఉండగా ఇసుక దోపిడీకి కొమ్ముకాస్తూ అనుచరగణాన్ని ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ నూతన విధానాన్ని నీరుగార్చేందుకు పన్నిన కుట్రలను విజిలెన్స్ విభాగం బట్టబయలు చేసింది. దోపిడీకి ఆస్కారం లేని, పారదర్శక విధానంలో వీలైనంత తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ నేతలు గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తేల్చింది. చంద్రబాబు, లోకేష్‌లు తమ సన్నిహితులకు చెందిన కంపెనీల ద్వారా ఇసుక రీచ్ టెండర్లలో అతి తక్కువ ధరలకు షెడ్యూలు దాఖలు చేయించడం ఇందులో భాగమేనని వెల్లడైంది. కొన్ని రీచ్‌లకు అత్యంత తక్కువ ధరకు షెడ్యూళ్లు దాఖలు కావడం వెనుక వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రీచ్ దక్కించుకున్నాక కొరత సృష్టించే కుట్ర
ఇసుక రీచ్‌లకు నిర్వహించిన టెండర్లను సమగ్రంగా అధ్యయనం చేసిన విజిలెన్స్ విభాగం ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తమ అనుచర గణంతో అతితక్కువ ధరకు టెండర్లను దాఖలు చేయించినట్లు తేల్చింది. తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ షెడ్యూలు దాఖలు చేయడం వెనుక దురుద్దేశపూరిత కుట్ర దాగి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అతి తక్కువ ధరకు టెండర్లను దక్కించుకున్న తరువాత పాత అనుభవంతో ఇసుక స్మగ్లింగ్‌కు పాల్పడి రూ. వేల కోట్లను కొల్లగొట్టడం, కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర ఇందులో దాగి ఉన్నట్లు విజిలెన్స్ విభాగం పేర్కొంది.
విజిలెన్స్ నివేదికతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌లు దక్కించుకున్న కాంట్రాక్టర్లపై డేగ కన్ను వేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా తక్కువ ధరకే ప్రజలకు ఇసుక సరఫరా చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీచ్‌ల నుంచి తవ్వి ఇసుకను డంపింగ్ యార్డ్‌కు తరలించే పనులకు ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ) ఇటీవల టెండర్లు నిర్వహించింది.
సగం ధరకే షెడ్యూలు దాఖలు..
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాణ్యమైన ఇసుక విస్తారంగా లభిస్తుంది. ఇసుక లభ్యత అధికంగా ఉండే ఈ మూడు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లపై కన్నేసిన చంద్రబాబు, లోకేష్‌లు తమ సన్నిహితులకు చెందిన ఆరు కంపెనీలతో 26 రీచ్‌ల్లో టన్ను ఇసుకను డంపింగ్ యార్డుకు తరలించేందుకు రూ.50 కంటే తక్కువకే షెడ్యూలు దాఖలు చేయించారు. టన్ను ఇసుక తవ్వి డంపింగ్ యార్డుకు చేర్చడానికి కనీసం రూ.వంద వ్యయం అవుతుందన్నది అధికారవర్గాల అంచనా. అలాంటిది టీడీపీ పెద్దల అనుచర గణం రూ.50 కన్నా తక్కువకే షెడ్యూలు దాఖలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నది స్పష్టం అవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇసుక టెండర్లను పూర్తిగా అధ్యయనం చేసి కుట్ర కోణాన్ని బహిర్గతం చేసింది. ఇసుక రీచ్‌లను దక్కించుకున్న తరువాత గిట్టుబాటు కావడం లేదని డంపింగ్ యార్డ్‌లకు తరలించకుండా మొండికేయడం ద్వారా కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే పన్నాగం ఇందులో దాగి ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
కుట్రకు సాక్ష్యాలు ఇవిగో..
- కృష్ణా జిల్లాలో గొట్టిపాటి శ్రీధర్ గోపాలకృష్ణ పేరుతో కేవలం రూ.36కే ఒకటో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డు తరలిస్తామంటూ షెడ్యూలు దాఖలైంది. ఈయన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుడు, టీడీపీ ఎమ్మెల్సీ బి.అర్జునుడికి సన్నిహితుడు.
- కృష్ణా జిల్లా 15వ ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి కేవలం రూ.29కే టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డుకు తరలిస్తామంటూ టీడీపీ నేత యలమంచిలి వెంకట కృష్ణమోహన్‌కు చెందిన శ్రీనివాస ఎడిపైస్ ప్రైవేట్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసింది. ఈయన లోకేష్ సన్నిహితుడు కావడం గమనార్హం.
- గుంటూరు జిల్లా ఏడో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి మొగిలి శ్రీనివాసరెడ్డికి చెందిన ఎమ్మెస్సార్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థతో కేవలం రూ.15కే టన్ను ఇసుకను రీచ్ నుంచి తవ్వి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తామంటూ షెడ్యూలు దాఖలు చేయించారు. మొగిలి శ్రీనివాసరెడ్డి తెలంగాణకు చెందిన టీడీపీ నేత. 2014 తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అయినప్పటికీ ఆయన చంద్రబాబు, లోకేష్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సన్నిహితుడు. మొగిలి శ్రీనివాసరెడ్డి సంస్థకే గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు అప్పగించేలా పావులు కదిపారు. ఈ టెండర్‌ను ఇటీవల సర్కార్ రద్దు చేసింది.
- తూర్పు గోదావరి జిల్లా మూడో ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి టన్ను ఇసుకను తవ్వి డంపింగ్ యార్డుకు చేర్చేందుకు సుధాకర్ ఇన్‌ఫ్రా పేరుతో మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ అనుచరులు రూ.68కే షెడ్యూల్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment