రైతు రుణాల మాఫీ
చంద్రబాబు గద్దెనెక్కే నాటికి రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ తరువాత వివిధ రకాల కోతలు, షరతులతో రుణాలను రూ.24,500 కోట్లకు కుదించేశారు. ఇప్పటివరకు మూడు విడతల్లో మాఫీ చేసిన రుణాలు రూ. 14,497 కోట్లు మాత్రమే. ఇది వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి 1,26,000 కోట్లకు చేరుకుని 35 లక్షల మంది డిఫాల్టర్లుగా మారారు. వారికి కొత్త రుణాలు ఇచ్చేదే లేదని బ్యాంకులు తేల్చిచెబుతున్నాయి.
డ్వాక్రా రుణ మాఫీ
చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. కానీ, నాలుగున్నరేళ్లలో డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి పైసా కూడా ఇవ్వకుండా దగా చేశారు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు.
బెల్టు దుకాణాల రద్దు
మద్యం బెల్టు షాపులను తక్షణమే రద్దు చేస్తున్నామని నమ్మబలుకుతూ ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు సంతకం చేశారు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు షాపుల వాటా రూ.9 వేల కోట్లకు పైమాటే.
ఎన్టీఆర్ సుజల
ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన చేసిన తొలి సంతకాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు కూడా ఒకటి. నాలుగున్నరేళ్లుగా ఈ పథకం పక్కాగా ఆమలైన దాఖలాలే లేవు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచినీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మరో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
సాక్షి, అమరావతి: 2014 జూన్ 8వ తేదీన ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నానంటూ సీఎం హోదాలో తొలిసారిగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. నాలుగున్నరేళ్లు దాటినా ఆ తొలి సంతకాలకు దిక్కులేకుండా పోయింది. తొలి సంతకాలంటే శిలాక్షరాలే. కానీ, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలపై ముఖ్యమంత్రి మళ్లీ కొత్త హామీల వల విసురుతుండడం గమనార్హం. తొలి సంతకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో పరిశీలిస్తే చంద్రబాబు చేసిన మోసం తేటతెల్లమవుతుంది.
రైతన్నలను నట్టేట ముంచేశారు
రాష్ట్రంలో వ్యవసాయ రుణమాఫీ అటకెక్కింది. చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పూర్తిగా అమలులోకి రాలేదు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతు రుణాలు బేషరతుగా మాఫీ కావాలి. అయితే ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ. 14,497 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి రూ. 1,26,000 కోట్లకు చేరుకున్నాయి.
రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో 35 లక్షల మంది రైతుల ఖాతాలు డిఫాల్టర్లుగా మారాయి. వారికి కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. రుణాలు చెల్లించని రైతుల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. లక్షలాది మందికి బ్యాంకుల నుంచి తాఖీదులు వచ్చాయి. అప్పులు కడతారా? లేక అరెస్టులు చేయించి కోర్టులకు ఈడ్చమంటారా? అంటూ బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్న, చిన్నకారు, కౌలు రైతులు సాగు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. వాటిని తీర్చే దారి కనిపించక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పల్లెపల్లెనా బెల్టు షాపుల జాతర
మద్యం బెల్టు దుకాణాలను వెంటనే రద్దు చేస్తున్నామంటూ చంద్రబాబు చేసిన సంతకం అపహాస్యం పాలైంది. బెల్టు దుకాణాల రద్దుపై చంద్రబాబు మొక్కుబడిగా ఓ జీవో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో బెల్టు షాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి కోసం గ్రామాల్లో ఏకంగా వేలంపాటలు జరుగుతున్నాయి. వీధివీధినా బెల్టు దుకాణాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కడా లేకుండా కత్తిరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ.. బెల్టు షాపుల రద్దు అనేది పెద్ద బూటకమని తేటతెల్లమైంది. నిన్న మొన్నటి దాకా ఫ్యాన్సీ దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపులు, మెడికల్ షాపుల్లో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహించిన వారు ఇప్పుడు తోపుడు బండ్లపైనా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 వరకు బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు అనుబంధంగా 10కిపైగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు దుకాణాల వాటా రూ.9 వేల కోట్ల పైమాటే కావడం గమనార్హం.
జాడ లేని ఎన్టీఆర్ సుజల
చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ఎన్టీఆర్ సుజల పథకం ఏమైందో తెలియదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా అందిస్తామని, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆ మేరకు సంతకం కూడా చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 48,363 నివాసిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో కేవలం 906 నివాసిత ప్రాంతాల్లోనే తొలుత కొన్నాళ్లు ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేసింది. అనంతరం సర్కారు పట్టించుకోకపోవడంతో ఆ 906 నివాసిత ప్రాంతాల్లో మంచినీటి ప్లాంట్లు నిర్వహణ లేక మూతపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కేవలం 354 నివాసిత ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకం అమలు జరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక, బోర్లు, బావుల్లోని నీటిని తాగడానికి వీలులేక ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు అమ్ముతున్న నీటిలో నాణ్యత గురించి పట్టించుకునే వారే లేకుండాపోయారు.
డ్వాక్రా మహిళలకు కన్నీరే మిగిలింది
డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూరా తిరుగుతూ హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ, నాలుగున్నరేళ్లుగా పైసాకూడా మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను కన్నీరు పెట్టించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క డ్వాక్రా సంఘాల రుణం మాఫీ చేయలేదని 2018 సెప్టెంబరు 7న మంత్రి పరిటాల సునీత శాసనసభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. డ్వాక్రా మహిళలు సంఘాల పేరిట పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులను అప్పుల కింద బ్యాంకులు జమచేసుకున్నాయి. గతంలో సున్నా వడ్డీ పథకం అమలయ్యేది. చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టాక ఆ పథకానికి నిధులు ఇవ్వడం మానేశారు. దాదాపు రెండేళ్లుగా సున్నా వడ్డీ డబ్బులను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడంతో రూ.2,300 కోట్ల వడ్డీని డ్వాక్రా సంఘాల సభ్యులు అదనంగా చెల్లించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment